ఏడు నెలల కిందట.. ఏపీ, తెలంగాణ భాయి భాయి.. విభజన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటాం. కేంద్రం వద్దకు వెళ్లే అవసరమే లేదంటూ… హైదరాబాద్లోని ఏపీ భవనాలను.. తెలంగాణకు ఇచ్చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కానీ ఏపీకి అనుకూలంగా… విభజన సమస్యల్లో ఒక్కటంటే.. ఒక్క సమస్యను పరిష్కరించలేకపోయారు. చివరికి వివాదంగా మారిన విద్యుత్ ఉద్యోగుల అంశం కూడా.. అంతే. కేంద్రం నియమించిన ధర్మాధికారి కమిటీ కూడా ఏపీ ప్రయోజనాలను కాపాడలేకపోయింది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్థానికత గల 1157 మందిని 2015 లో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి ఏకపక్షంగా రిలీవ్ చేశారు. వీరిని చేర్చుకోవడానికి ఏపీ విద్యుత్ సంస్థలు నిరాకరించాయి. ఈ వివాదాన్ని తేల్చడానికి ధర్మాధికారితో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అయితే.. వీరంతా… తెలంగాణ ఉద్యోగులని ఏపీ వాదిస్తోంది. వీరిలో 613 మంది ఏపీ ఆప్షన్ ఇచ్చారు. వారందర్నీ ఏపీ తీసుకుంటే.. మిగిలిన వారిని తాము తీసుకుంటామని తెలంగాణ వాదించింది. ఈ ప్రతిపాదనలన్నింటినీ ఏపీ తిరస్కరించింది.
కేసీఆర్తో ఈ విషయాన్ని చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకుంటామని.. గతంలో సీఎం ప్రకటించారు. ప్రగతిభవన్లో జరిగిన సమావేశాల్లో పలుమార్లు చర్చకొచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే.. వారంతా.. ఏపీ ఉద్యోగులేనన్న భావనలో తెలంగాణ.. కాదు తెలంగాణ ఉద్యోగులేనని ఏపీ సర్కార్ వాదన.. ఉద్యోగుల్ని… గాల్లో ఉంచేసింది. ఏళ్లు గడిచిపోతున్నా.. ఇప్పటికీ.. వారి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది.