పది జిల్లాల తెలంగాణ .. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 31 జిల్లాలు అయ్యాయి. ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ రెండు కొత్త జిల్లాలకు హామీలిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలలోపు.. ఆ రెండు జిల్లాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. కేసీఆర్ ప్రకటనతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భాగంగా ఉన్న ములుగు, మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట.. కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. దీంతో తెలంగాణ ఇక 33 జిల్లాల రాష్ట్రం కానుంది. ములుగును సమ్మక్క-సారలమ్మ పేరుతో, నారాయణపేటను అదే పేరుతో జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా పెంచనున్నారు. ఈ క్రమంలో కొత్త మండలాలు కూడా ఏర్పాటు కానున్నాయి. అంటే.. ఓ రకంగా మొత్తం వ్యవస్థను మళ్లీ సమీక్షించాల్సి ఉంది.
కొత్త జిల్లాల వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమిటో తెలంగాణ సమాజానికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. జిల్లాకో కలెక్టర్‌ను ఎస్పీని నియమించినప్పటికీ… ప్రత్యేకంగా చేయడానికేమీ ఉండటం లేదు. చాలా తక్కువ పరిమితి ఉండటంతో.. ఆర్డీవో స్థాయి వ్యవహారాలను చక్క బెట్టుకోవాల్సి వస్తోంది. కొత్త జిల్లాలు వస్తే… గొప్పగా ఉద్యోగవకాశాలు వస్తాయన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఎలా వస్తాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా వస్తాయనేది అపోహనే. 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చిన తర్వాత కూడా.. కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఏర్పడలేదు. ఇప్పుడు మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి కొత్త జిల్లాలు ఉనికిలో ఉన్నాయో లేవో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే.. అందరూ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే వ్యవహారాలు నడుపుతున్నారు. చివరికి అధికార వర్గాలు కూడా సమీక్షల్లో ఉమ్మడి జిల్లాలనే సంబోధిస్తున్నాయి.
నిజానికి కొత్త జిల్లా ఏర్పాటు వల్ల… ఉద్యోగ నియామకాల ఇబ్బంది ఏర్పడింది. జోన్ల విషయంలో మళ్లీ రాష్ట్రపతి ఉత్తర్వులు కావాల్సి రావడంతో… ఎన్నికల ముందు వరకూ.. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లన్నీ గందరగోళంలో పడిపోయాయి. చివరికి ఎన్నికలకు ముందు కేసీఆర్.. జోన్లపై రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకు రాగలిగారు. ఇప్పుడు మళ్లీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే.. మళ్లీ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసం ఢిల్లీకి పరుగెత్తాల్సి ఉంటుంది. అంటే.. మరోసారి ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం తప్పదన్నమాట. సాధారణంగా.. జిల్లాలు పెద్దగా ఉంటే.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కటి ఏర్పాటు చేసుకుంటారేమోకానీ.. ఇలా మూడు, నాలుగు అసెంబ్లీ నియోజవర్గాలకు ఓ జిల్లాకు ఏర్పాటు చేయడం.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదు. తెలంగాణలోనే జరుగుతోంది.