తెలంగాణ ప్రభుత్వం ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. తెలంగాణ నుంచి ఎవరూ.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు వెళ్లవద్దని సూచించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా ఉన్నందున ఈ నిషేధాజ్ఞలు విధించింది. దీనికి కారణం ఉంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంది. అక్కడి నుంచి ఎక్కువగా మహారాష్ట్ర వైపు వెళ్లి రోజువారీ వ్యవహారాలు చక్క బెట్టుకుంటూ ఉంటారు. మహారాష్ట్రలో కరోనా ఉద్దృతి తీవ్రంగా ఉంది. ఇక ఏపీ, తెలంగాణ సరిహద్దుల గురించి చెప్పాల్సిన పని లేదు. మామూలు రోజుల్లో నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి ప్రతీ రోజు పెద్ద ఎత్తున గుంటూరు, విజయవాడకు వెళ్లి వస్తూ ఉంటారు.
మహబూబ్ నగర్, గద్వాలకు చెందిన వారు కర్నూలుకు వెళ్లి వస్తూంటారు. లాక్ డౌన్ సమయంలోనూ.. ఆయా ప్రాంతాల నుంచి రాకపోకలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో.. గ్రీన్ జోన్ మండలాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో.. ఇవి మరింత పెరుగుతాయని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. వైద్యం కోసం.. మహబూబ్ నగర్, గద్వాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున కర్నూలుకు వెళ్తారు. కర్నూలు ప్రస్తుతం హాట్ స్పాట్ గా ఉంది. అందుకే అత్యువసర పనులైనా తెలంగాణలోనే చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల వాసులకు.,. హైదరాబాద్ కన్నా విజయవాడ దగ్గర. దాంతో.. వ్యాపార, వైద్య అవసరాల కోసం ఎక్కువగా విజయవాడ వెళ్తూంటారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసర పనులకు కూడా.. విజయవాడ, గుంటూరు వైపు పోవద్దని తెలంగాణ సర్కార్ తేల్చేసింది. నిజానికి అంతర్రాష్ట్ర సరిహద్దులు ఎప్పుడో మూసేశారు. అయితే.. అత్యవసరపనుల మీద కొందరు వెళ్లి వస్తూనే ఉంది. అంతే కాదు.. తెలంగాణలో ఏడో తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఏపీలో మాత్రం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. సడలింపులు ఇస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణ సర్కార్ ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది.