తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పని తీరులో మరో గొప్ప వ్యవహారం బయటపడింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి ఓట్లకోసం ఏర్పాటు చేసిన పోస్టర్ బ్యాలెట్ విధానాన్ని నిర్వీర్యం చేసింది. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణలో ఎన్నికల సంఘం అత్యంత ఘోరాతిఘోరంగా విఫలమైంది. నిజానికి ఈ పోస్టల్ బ్యాలెట్.. సాధారణ ఓటింగ్ కన్నా ముందే వేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బందికి పోస్టు ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇచ్చే ఓటు ఇది. పోలింగ్ సిబ్బంది రెండు మూడు వారాల ముందునుంచే ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో వుంటారు. శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ సిబ్బందికి కనీసం వారం రోజుల ముందే పోస్టల్ బ్యాలెట్ పేపరు అందుబాటులో ఉంచుతూ ఉటారు. కానీ.. తెలంగాణ ఎన్నికల సంఘం ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. వేల సంఖ్యలో పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు అందలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంజన్ 15వేల మందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందలేదని ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు కూడా నిరసన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్లు చేతికి ఇచ్చారు కానీ.. బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయలేదు. దాంతో వాటిని ఏమీ చేయాలో ఉద్యోగులకు అర్థం కాక… ఎవరికీ అర్థం కాలేదు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో స్థానిక రిటర్నింగ్ కార్యాలయంలో గానీ, పోస్టాఫీసులో గాని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ వివాదం కూడా చుట్టుముట్టడంతో… ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్.. ఆదివారంనాడు ఓ ప్రకటన విడుదల చేశారు. పోస్టల్ బ్యాలెట్ అందని వారు.. సోమవారంనాడు తమ స్థానిక నియోజకవర్గపు రిటర్నింగ్ అధికారిని కలిసి, గుర్తింపు కార్డు చూపించి, సాయంత్రంలోగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. మంగళవారం పొద్దున్నే కౌంటింగ్ జరుగుతూంటే.. సోమవారం ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారో… రజత్ కుమార్ కే తెలియాలి. రిటర్నింగ్ అధికారులకు ఇంకే పనీ లేకుండా.. పోస్టల్ బ్యాలెట్లపై సంతకాలు చేస్తూ కూర్చుంటారా..?