నేటి నుండి మళ్ళీ తెలంగాణా శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. వచ్చేనెల 10 వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఇంతకు ముందు రెండు సార్లు జరిగిన శాసనసభ సమావేశాలలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎక్కువ కాలం కాకపోవడంతో ప్రతిపక్షాల నుండి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకుండానే తప్పించుకోగలిగింది. కానీ ఇప్పటికి 14నెలలు పూర్తయిపోయాయి. కనుక రాష్ట్రంలో ఏర్పడుతున్న అన్ని సమస్యలకి గత ప్రభుత్వాలే కారణమని తెరాస ఆరోపిస్తూ చేతులు దులుపుకోలేదు. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు వాటిని గట్టిగా త్రిప్పి కొడతాయి.
గమ్మత్తయిన విషయం ఏమిటంటే ‘ఆపరేషన్ ఆకర్ష’ ద్వారా ప్రతిపక్షాలను బలహీనపరుద్దామని తెరాస ఇంతకాలం ప్రయత్నించింది. కానీ తెరాస ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి వివిధ సమస్యలపై ఒకదానికొకటి సహకరించుకొంటూ ఒక్క త్రాటిపైకి వచ్చి పోరాడుతున్నాయి. ప్రతిపక్షాల మధ్య అనూహ్యంగా ఏర్పడిన ఈ ఐఖ్యత కారణంగా ఈసారి శాసనసభలో వాటిని ఎదుర్కోవడం తెరాస ప్రభుత్వానికి చాలా కష్టమే. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కల్తీ కల్లు వలన మరణాలు, జి.హెచ్.యం.సి.పరిధిలో సుమారు 25లక్షల మంది ఆంధ్రా ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అనేక సమస్యలపై ప్రతిపక్షాలు శాసనసభలో తెరాస ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాయి.
శాసనసభలో తమ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల వద్ద ‘బలమయిన సబ్జెక్ట్’ ఏదీ లేదని కనుక వారిని చూసి తెరాస ఎమ్మెల్యేలు భయపడనవసరం లేదని, కానీ అందరూ పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దైర్యం చెప్పడం గమనిస్తే పరిస్థితి ఏవిధంగా ఉండబోతుందో ఆయనా గ్రహించినట్లే ఉన్నారు.