తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన దాదాపు నెల తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జనవరి 17 నుంచి 20 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ కు అవకాశం ఇచ్చారు. ముంతాజ్‌ఖాన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనవరి 16న ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ఖాన్ తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 17న సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుంది. అదే రోజు స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. జనవరి 18న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
స్పీకర్ ఎన్నిక ముగిసిన వెంటనే కొత్త స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ఉంటుంది. జనవరి 19న శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. జనవరి 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల దాటిపోయినా.. ఇంత వరకూ.. అసెంబ్లీని సమావేశ పరచడం లేదనే విమర్శలు పెరుగుతూండటంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ గా ఎవర్ని ఎంపిక చేశారన్న విషయంపై ఇంకా తేల్చుకోలేదు.
అదే సమయంలో… మంత్రి వర్గ విస్తరణ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఉంటుందా.. లేదా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలో… ప్రగతి భవన్ నుంచి మీడియాకు వచ్చిన సమాచారం ప్రకారం.. పద్దెనిమిదో తేదీన.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. మంత్రి కేటీఆర్ కూడా.. పంచాయతీ ఎన్నికల లోపే.. పదవుల పంపకం ఉంటుందని ప్రకటించారు. దీంతో.. మంత్రివర్గ విస్తరణ కూడా.. అసెంబ్లీ సమావేశాల లోపే ఉండవచ్చని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ మనసులో ఏముందో మాత్రం బయటకు తెలియడం లేదు.