తెలంగాణ అసెంబ్లీని ఇలా సమావేశపరిచి..అలా నాలుగు బిల్లుల సవరణలు ఆమోదించుకుని అలా నిరవధికంగా వాయిదా వేసేశారు. పట్టుమని ఒక్క పూట కూడా సాగని సభలో నాలుగు నాలుగు చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపారు. ఇండియన్ స్టాంప్, జీహెచ్ఎంసీ, అగ్రికల్చర్ ల్యాండ్ బిల్లు.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లులకు సభ ఆమోదించింది. ఆ తరవాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. వీటిని రేపు శాసన మండలిలో ప్రవేశపెట్టి..అంతే వేగంగా ఆమోదించుకుని ఆ సభనుకూడా నిరవధికంగా వాయిదా వేస్తారు.
భూముల ధర నిర్ధారణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47 ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను ప్రస్తుత చట్ట సవరణ ద్వారా రద్దు చేశారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతరాలుగా బదలాయించే ప్రక్రియలోనూ అధికారులకు విచక్షణాధికారాలు లేకుండా మార్పుచేశారు. మొత్తంగా జీహెచ్ఎంసీ చట్టంలోనే ఐదు సవరణలుచేశారు. 50 శాతం మహిళలకు రిజర్వేషన్.. జీహెచ్ఎంసీ బడ్జెట్లో 10 శాతం పచ్చదనం కోసం కేటాయించడం.. వంటిసవరణలు ఉన్నాయి. అలాగే జీహెచ్ఎంసీ రిజర్వేషన్ రెండు సార్లు కొనసాగిస్తూ చట్ట సవరణ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి.. ఎన్నికలు నిర్వహించాలని చట్ట సవరణ చేశారు.
బిల్లుల ఆమోదం కోసమే సభను పెట్టారు కాబట్టి ప్రజా సమస్యలపై చర్చించే చాన్సే రానీయలేదు . ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ అనుకుంది. కానీ ఆ చాన్స్ ఇవ్వలేదు. ఆ టాపిక్ కూడా… చర్చకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. దీనిపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్దేశం తలిసిపోయింది కాబట్టి.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసలు హాజరు కాలేదు.