గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీయేటా గవర్నర్ ఇచ్చే ఈ విందుకు పార్టీలకు అతీతంగా నాయకుల్ని ఆహ్వానించడం, రాజ్ భవన్ లో నేతలు కలుసుకోవడం.. సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం జరిగిపోతూ ఉండేది. కానీ, ఈసారి ఈ కార్యక్రమంపై కొంత రాజకీయ రంగు పడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తెరాస నేతలు హాజరయ్యారు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాలేదు! ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో, సమయాభావం వల్ల హాజరు కాలేకపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, తెలంగాణ టీడీపీ నేతలు ఎట్ హోమ్ కి వచ్చారు. రాష్ట్ర భాజపా నేతలు కూడా ఈ కార్యక్రమంలో కొంత సందడి చేశారు.
ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కారుకు అనుకూలంగా నరసింహన్ వ్యవహరిస్తున్నారని వారి ప్రధాన ఆరోపణ. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలనీ, మంద కృష్ణ మాదిగి అరెస్టు అంశమై గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి రాజ్ భవన్ కు వెళ్తే… ఈ అంశాలపై అధికార పార్టీకి అనుకూలంగా గవర్నర్ స్పందిచారంటూ కొంత వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ కాంగ్రెస్ నేతలు నరసింహన్ పై విమర్శలు చేస్తున్నారు. ఆ తరువాత, కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ సందర్శించి, కేసీఆర్ పై పొగడ్తలు కురిపించడంతో కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్టు అయింది. దీంతో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని వారు బహిష్కరించారు. అయితే, పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే… దానం నాగేందర్ రాజ్ భవన్ కి రావడం ఆసక్తికరంగా మారింది. ఆయతోపాటు రాపోలు ఆనంద్ భాస్కర్ కూడా హాజరయ్యారు. పార్టీ నిర్ణయాన్ని కాదని వీరు ఎందుకు వచ్చారనేది చర్చనీయం అవుతోంది.
ఇదే విషయాన్ని మీడియా అడిగితే… ఈ విందును పార్టీ బహిష్కరించిందనే సమాచారం తమకు లేదని దానం చెప్పారు! రాపోలు కూడా ఇదే మాట అన్నారు. అదేంటీ… కాంగ్రెస్ తోపాటు వామపక్షాలు కూడా ఎట్ హోమ్ ను బహిష్కరించిన సంగతి మీడియాలో చర్చనీయాంశం అయింది కదా. పైగా, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య నరసింహన్ గుర్రుగా ఉంది, పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే.. తమకు సమాచారం లేదని దానం చెప్పడం కాస్త విడ్డూరంగా ఉంది! నిజానికి, దానం నాగేందర్ చాన్నాళ్లుగా కాంగ్రెస్ లో క్రియాశీలంగా లేరు. పార్టీకి సంబంధించి ఏ విషయాలను ఆయన పట్టించుకోవడం లేదనే కథనాలూ ఉన్నాయి. ఇంతటి ముఖ్యమైన విషయాన్ని కూడా పట్టించుకోలేదంటే కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఏదైతేనేం.. ప్రతీయేటా ఎట్ కార్యక్రమం రొటీన్ గా జరిగేది. కానీ, ఈసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీటన్నింటికీ అతీతంగా ఉండాల్సిన రాజ్ భవన్ కూడా రాజకీయాంశంగా మారిపోయింది…!