హైదరాబాద్: ఈ నెల మొదటివారంలో ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే ఇవాళ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆద్యంతం పరస్పర నిందారోపణలు, వాగ్వాదాలు, తిట్టుకోవటాలతో సాగిపోయాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలలో అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టించింది. వైసీపీ సభ్యులు ప్రభుత్వంపైకి ఒంటికాలిమీద దూసుకెళ్ళారు. అధికారపార్టీలోని అచ్చెన్నాయుడు, బొండా ఉమామహేశ్వరరావు ప్రభృతులుకూడా వారికి దీటుగానే బదులిచ్చారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నేతలమధ్య అనేక బూతులు, తిట్లు, శాపనార్థాలుకూడా దొర్లాయి. మొత్తంమీద ఏపీ అసెంబ్లీ సమావేశాలు కేకలు, తిట్లమధ్యే గడిచిపోయాయి. దేనిపైనా ఒక్క నిర్మాణాత్మక చర్చకూడా జరగకపోగా ప్రశ్నోత్తరాల సమయంకూడా హరించుకుపోయింది. విలువైన సమయం ఎంతో వృథా అయిపోయింది.
ఇక ఇవాళ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏపీతో పోలిస్తే చాలా ప్రశాంతంగానే సాగుతున్నాయి. మధ్యలో అక్బరుద్దీన్ ఓవైసీకి, కేటీఆర్కు మధ్య స్వల్ప వాగ్వాదం తప్పితే సాఫీగా సాగుతోంది. అందులోనూ ఏపీకి, తెలంగాణకు రాజకీయపరంగా మౌలికంగా ఒక తేడా ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకు మధ్య వైరం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఇరుపార్టీల సభ్యులూ అసెంబ్లీలో నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు వాదులాడుకుంటారు. అందులోనూ అధికారపార్టీని ఎలాగైనా ఇరుకున పెట్టాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో సామరస్యంగా వ్యవహరిస్తోంది. ఇవాళ రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రైతు ఆత్మహత్యలు ఆపటానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంగా ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చరిత్రలో నిలిచిపోవాలని సాఫీగా సలహాలిచ్చారు. రెండు రాష్ట్రాలలో ఉన్న తేడా ఇక్కడే తెలిసిపోయింది. అలా చూసుకుంటే ప్రజలకు ఉపయోగపడేరీతిలో చర్చలు జరగటానికి, సమస్యలు పరిష్కారమవటానికి ఏపీకంటే తెలంగాణ అసెంబ్లీలో ఎక్కువ అవకాశమున్నట్లే కదా!