గ్రేటర్లో ఎన్నికలు గెలుపొందడానికి భారతీయ జనతా పార్టీ డబుల్ బెడ్ రూం ఇళ్ల నినాదాన్ని అందుకుంటోంది. తమ పార్టీకి మేయర్ సీటు ఇస్తే.. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా చెబుతున్నారు. నిజానికి డబుల్ బెడ్ రూం ఇళ్లకు.. గ్రేటర్ కార్పొరేషన్‌కు సంబంధంలేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. మేయర్ అయితే ఇళ్లు ఎలా నిర్మిస్తారో బీజేపీ నేతలు వివరంగా చెప్పడం లేదు కానీ.. తెలంగాణలో కేసీఆర్ ఇస్తామని చెబుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిధులన్నీ కేంద్రానివేనని ప్రచారం మాత్రం చేస్తున్నారు. కేసీఆర్ ఖర్చు చేస్తున్న ప్రతీరూపాయి.. కేంద్రం ఇస్తున్నదేనని.. కేంద్రంలో ఉన్న తమ పార్టీ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. ఆ వ్యూహాన్ని ఇప్పుడు గ్రేటర్‌కు కూడా తీసుకు వచ్చారు.
గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించడానికి డబుల్ బెడ్ రూం ఇళ్లే కారణం. తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో కొన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లను హుటాహుటిన నిర్మించిన ప్రభుత్వం వాటిని చూపించి.. గ్రేటర్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.అలాంటి ఇళ్లు లక్ష కట్టిపేదలకు ఇస్తామని చెప్పింది. దాదాపుగా ప్రతీ ఇంటి నుంచి దరఖాస్తు తీసుకుంది. అలా దరఖాస్తు ఇచ్చిన వారందరూ టీఆర్ఎస్కు ఆశతో ఓటు వేశారు. కానీ ఇప్పటికి ఏడేండ్లు గడిచాయి. లక్ష బెడ్ రూం ఇళ్లు మాత్రం కనిపించడం లేదు. ఎన్ని కట్టారో స్పష్టత ఇవ్వడం లేదు.
లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టాలంటే… ఒక్కో ఇంటికి వ్యయం రూ. 10 లక్షలు వేసుకున్నా.. పది లక్షల కోట్లు అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ.. రూ. నాలుగైదు వేల కోట్లు కూడా.. ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేసినట్లుగా లెక్కలు లేవు . కేంద్రం కూడా.. ఎన్నో సార్లు తాము ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న నిధుల గురించిచెప్పాలని కోరింది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం.. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. వివిధ పథకాల కింద ఇళ్ల నిర్మాణానికి వచ్చే నిధులు కూడా.. తెలంగాణకు పరిమితంగానే వస్తున్నాయి. అయినప్పటికీ.. డబుల్ బెడ్ రూం అనేది అత్యంత ఆకర్షణీయమైన నినాదంగా ఉంది. అందుకే బీజేపీ ఈ సారి ఆ ఫలాల్ని పొందాలని అనుకుంటోంది.