ప్రజల భావోద్వేగాలను ఎలా రెచ్చగొట్టాలో బీజేపీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తెలంగాణ బీజేపీ ఈ విషయంలో ది బెస్ట్ అన్నంతగా ప్రయత్నిస్తోంది. తాజాగా రజాకార్లు అప్పుడెప్పుడో అరాచకాలకు పాల్పడ్డారని గుర్తు చేసి ఇప్పుడు రాజకీయం చేయాలనుకుంటోంది. ఇందు కోసం రెండు సినిమాలు తీస్తోంది. ఇందు కోసం నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడిన కష్టాలను ఇప్పటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే బండి సంజయ్ సూచనలతో ‘రజాకార్’ అనే సినిమా సెట్స్ పై ఉందని చెబుతున్నారు. ‘రజాకార్ ఫైల్స్’ పేరుతో మరో కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు.
నిజాం హయాంలో హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు పడిన ఇబ్బందులను ఇప్పటి వరకు కేవలం పుస్తకాల్లోనే, ఎవరో చెబితే విన్నాం. హిందువులే టార్గెట్ గా వారు సృష్టించిన మారణహోమాన్ని గుర్తు చేసుకుంటేనే యావత్ తెలంగాణ ప్రజానీకం ఉలిక్కిపడుతుంది. వీటిని హిందువులపై జరిపిన దాడులుగా చూపించాలని బీజేపీ తాపత్రయం. నిజానికి అప్పట్లో రజాకార్ల ఆగడాలు వర్గాలను టార్గెట్ చేయలేదు. అందర్నీ టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ అవసరాల కోసం తీస్తున్నారు కాబట్టి మతాల గొడవ వెలికి తీస్తున్నారు.
1990లో కశ్మీర్ లో జరిగిన మారణహోమాన్ని ఇటీవల ‘కశ్మీర్ ఫైల్స్’ పేరిట తెరకెక్కించారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు కూడా సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో హైదరాబాద్ సంస్థానంలో రజాకర్ల అకృత్యాలను తెరపైకి చూపించి భావోద్వేగం పెంచాలనుకుంటున్నారు. హైదరాబాద్ తోపాటు, రాజస్థాన్ లో షూటింగ్ కొనసాగుతోందని చెబుతున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి ఉన్నారు.