“నువ్వు దీంతో మొదలు పెట్టావో అది నీతోనే ఉంటుంది బద్దం” – బ్రహ్మానందం పాత్ర ఉద్దేశించి అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఈ డైలాగ్ తెలంగాణ బిజెపి కి భలే చక్కగా సరిపోయినట్లు అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
2014లో తెలంగాణ సాధించే సమయానికి తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి పార్టీలు బలంగా ఉండేవి. వీటితో పోలిస్తే బిజెపి ఎక్కడో ఒకటి అర సీట్లు మాత్రమే సాధిస్తూ వెనకబడి ఉండేది. అయితే ఆ తర్వాత ఐదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. టిడిపి పార్టీ తెలంగాణ నుండి పూర్తిగా అంతర్థానమైంది. 2014లో గణనీయమైన స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఐదేళ్లలో బలాన్ని క్రమక్రమంగా కోల్పోతూ వచ్చింది. తెలంగాణలో సరైన ప్రతిపక్షం లేదు అన్న వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్న సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తెలంగాణలో కూడా బలాన్ని పెంచుకోడానికి ప్రయత్నించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో, ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో, దాని తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలలో ఆశ్చర్యకర ఫలితాలను బిజెపి సాధించడంతో కెసిఆర్ కు సరైన సమవుజ్జీ బండి సంజయే అని, 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కెసిఆర్ ను మట్టికరిపించినా కూడా ఆశ్చర్యం లేదని విశ్లేషణలు వినిపించాయి.
అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీకి అంత సీన్ ఉండే పరిస్థితి లేదన్న వ్యాఖ్యలు జనం నుండే వస్తున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డిపాజిట్లు కోల్పోవడం, ఇక తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో బిజెపి పేలవమైన ప్రదర్శన చేయడం చూస్తుంటే బిజెపి మళ్ళీ తన మునుపటి స్థితికి వచ్చేసినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో ఖమ్మం కార్పొరేషన్లో 60 స్థానాలకు గాను కేవలం ఒకే ఒక స్థానానికి బిజెపి పరిమితం కావలసి వచ్చింది. ఇక మున్సిపాలిటీల్లో కూడా దాదాపు 122 వార్డులకు గాను బిజెపి కేవలం 4 వార్తలు మాత్రమే గెలవడం ఆ పార్టీ బలహీనతను, వైఫల్యాన్ని సూచిస్తోంది.
ఏదిఏమైనా మొన్నటి వరకు బండి సంజయ్ తదితర బిజెపి నేతలు చేసే ఘాటు వ్యాఖ్యలు కెసిఆర్ పై ఉరిమినట్లు జనాలకు కనిపిస్తే, ఇప్పుడు వారు చేస్తున్న అవే వ్యాఖ్యలు ప్రజామోదం లేని రంకెల లా కనిపిస్తున్నాయి. అందుకే బిజెపి తాను ఎక్కడ మొదలైందో అక్కడికే తిరిగి వచ్చింది అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.