తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు భవిష్యత్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారి పరువు పోయింది. తాము టిక్కెట్లు ఇప్పించుకున్న వారే కాదు..తాము కూడా పరాజయం పాలయ్యారు. ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బరిలోకి దిగారు కానీ పరాజయమే ఎదురయింది. బండి సంజయ్ కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక మరో ఎంపీ బాపూరావు దీ అదే పరిస్థితి. అంటే ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ముగ్గురూ ఓడిపోయారు.
ఈటల రాజేదంర్ తాను పట్టుబట్టి మరీ పలువురికి టిక్కెట్లు ఇప్పించుకున్నారు వారెవరూ గెలవలేదు. కానీ ధర్మపురి అర్వింద్ తో పాటు బండి సంజయ్ టిక్కెట్లు ఇప్పించుకున్న కొంత మంది గెలిచారు. దీంతో వారు కాస్త ధైర్యంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సిట్టింగ్ ఎంపీలకు హైకమాండ్ టిక్కెట్లు కేటాయిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ స్థాయిలో ఎంపీ స్థానానికి పోటీపడే నాయకుడు లేకపోవడం ఆయనకు కలిసి వస్తుంది. బండి సంజయ్ కు హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కిషన్ రెడ్డి తన సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయమే. మరో వైపు ఈటల రాజేందర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇంత కాలం రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న ఆయన బీజేపీ తరపున లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారు.
కానీ ఆయనకు సరైన స్థానం లేదు. కరీంనగర్ లో బండి సంజయ్ ఉంటారు. అందుకే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నాురు. ఆయనకు హైకమాండ్ చాన్స్ ఇస్తుందా లేదా.. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని చెబుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు కానీ.. ఆయన మాత్రం పార్లమెంట్ కు పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు.