దక్షిణాదిలో బలపడటమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న కమలనాధులు.. కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావటమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించుకోవటంతో పాటు.. ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను చేర్చుకోవాలనేది బీజేపీ అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. అమిత్ షా స్వయంగా తెలంగాణలో అధికారంలోకి తెచ్చే బాధ్యతను తలకెత్తుకున్నారు. ప్రతి నెల తెలంగాణలో పర్యటిస్తానన్న అమిత్ షా.. ఆగస్ట్ 15లోపు తెలంగాణకు రానున్నారు. భారీ చేరిక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
గతంలో వివిధ పార్టీల నాయకులను వేర్వేరుగా బీజేపీ చేర్చుకుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే.అరుణ లాంటి వాళ్ళు కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తర్వాత పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీమంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్థన్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డిలు బీజేపీలో చేరారు. అయితే తెలంగాణ బీజేపీ ఈసారి తన ప్రమాణళికను మార్చింది. ఒక్కొక్క నేతను కాకుండా.. ఒకే సారి భారీ స్థాయిలో ఇతర పార్టీల నాయకులకు బీజేపీ లో చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ కారణంగానే.. బీజేపీలో చేరడానికి ఢిల్లీ వెళ్లిన వివేక్.. అగ్రనేతలను కలిసి వచ్చారు కానీ.. బీజేపీలో చేరలేదు.
మాజీ ఎంపీ జీ.వివేక్ తో పాటు.. కాంగ్రెస్, టీడీపీ సహా.. అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునే పనిలో బీజేపీ నేతలున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి సహా.. హైద్రాబాద్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు భారీగా బీజేపీలో చేరనున్నారని సమాచారం. వీరిలో జిల్లాల అధ్యక్షులతో పాటు.. నియోజకవర్గాల ఇంఛార్జులు కూడా భారీగా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆగస్ట్ ఏడో తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలతో అమిత్ షా బిజీగా ఉండనున్నారు. దీంతో ఆగస్ట్ రెండో వారంలో అమిత్ షా హైద్రాబాద్ వస్తారని అంటున్నారు. ఈ చేరికల జాతరతో… బీజేపీ ఎంతగా బలపడిందో.. నిరూపిస్తామని అంటున్నారు.