తెలంగాణ బీజేపీ విషయంలో హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీ చాప చుట్టుకుపోతోంది. తెలంగాణ బీజేపీ ఇప్పుడు సంధి దశలో ఉంది. గతంలో పాదయాత్రలని.. మరొకటని జోరుగా ప్రజల్లోకి వెళ్లిన నేతలు ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నారు. మా పదవుల్ని తీసేయడం లేదని మీడియాకు వివరణ ఇచ్చేందుకు సమయం వెచ్చిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం జోరు మీద ఉంది. బహిరంగసభలు..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చింది. దీనికి కారణం ఆయన ప్రధానంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవడమే. అయితే చివరికి వచ్చే సరికి సీన్ మారిపోయింది. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలేనన్నట్లుగా ఇక బీఆర్ఎస్తో ముఖామఖి పోరు ఉందని.. బెంగాల్ తరహాలో పోరాటమేనని బీజేపీ నేతలు అనుకున్నారు. తీరా చూస్తే.. మొత్తం కాల్పుల విరమణ జరిగిపోయినట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇది తమ పార్టీని ఇబ్బంది పెట్టడమే కాదు.. ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని అంచనా వేయలేకపోయారో .. మరో విధమైన రాజకీయ వ్యూహం ఉందో కానీ.. మొత్తంగా పార్టీ నేతల్ని.. పార్టీని నమ్ముకున్న క్యాడర్‌కి షాక్ ఇచ్చేసింది.
ఇప్పుడు బండి సంజయ్ విషయంలో రచ్చ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. బండి సంజయ్ ను కేంద్రమంత్రిని చేసి కిషన్ రెడ్డిని మళ్లీ తెలంగాణ చీఫ్ ను చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే అసలు రేసులో లేకుండా పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన తెలంగాణ బీజేపీ నేతల్లోనే ఏర్పడుతోంది. బీఆర్ఎస్ విషయంలో కఠినంగా లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది బీజేపీకి మైనస్సే కానీ ప్లస్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.