తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరే కాదు అంతకు మించిన రాజకీయం నడుస్తోందని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమం ఏది పెట్టిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుగా విరాళాల సేకరణ ప్రారంభిస్తూండటంతో పార్టీ నేతలు పై స్థాయి నేతలకు ఫిర్యాదులు చేస్తున్నారు. మోదీ బహిరంగసభ నిర్వహణ భుజాన వేసుకున్న బీజేపీ నేతలు ఖర్చుల కోసం అంటూ విరాళాల సేకరణ ప్రారంభించారు. పార్టీ నేతలందరూ విధిగా విరాళం ఇవ్వాలని నిర్దేశించారు.
విరాళాలుగా డిజిటల్ రూపంలో తీసుకుంటున్నది కొంతేనని.. నగదు రూపంలో తీసుకుంటున్నది ఎక్కువని ఈ మొత్తం ఎటు పోతుందో కూడా ఎవరికి తెలియడం లేదన్న గుసగుసలు ఎక్కువగా బీజేపీలో వినిపిస్తున్నాయి. నిజానికి ఇలా విరాళాలు వసూలు చేయడం ఇదే మొదటి సారి కాదు. బండి సంజయ్ పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నప్పటి నుంచి ఈ విరాళాల ప్రక్రియ కొనసాగుతోంది. బండి సంజయ్ మహాసంగ్రామయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. రెండు విడతలు పూర్తయింది. ఈ రెండు విడతల పాదయాత్ర ఖర్చు అంతా పార్టీ సానుభూతి పరులతో పాటు పలువురు సానుభూతిపరుల నుంచి సేకరించిందేనని.. దేనికీ లెక్కల్లేవన్న ఆరోపణలు వస్తున్నాయి.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అనేక ఆరోపణలు వస్తున్నాయి. మొదటగా ఆయన కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేశారని చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈడీ నోటీసులంటూ హడావుడి జరిగింది. ఆ తర్వాత సైలెంటయిపోయారు. ఆ తర్వాత ఆయన పలు చోట్ల భూములు కొన్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయిన దానికి కాని దానికి… ప్రతి కార్యక్రమానికి కార్యకర్తలు, నేతల నుండి వసూలు చేయడమేమిటని బీజేపీ నేతల్లోనూ అసహనం కనిపిస్తోంది. అందుకే హైకమాండ్‌కు అదే పనిగా ఫిర్యాదులు చేస్తున్నారు.