ఎలక్షన్లు అయిపోయాయి కదా… ఇంకా దేనికి ప్రచారం అనుకుంటున్నారా..? త్వరలో భారీగా ఎన్నికలంటూ ఏవీ లేవు కదా… ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రజల్లోకి వెళ్తా అని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటనలు చేస్తున్నారని అనుకుంటున్నారా..? ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సింది చాలా ఉందనీ, ఇంటింటికీ వెళ్లి వివరించాల్సిన బాధ్యత తమపై ఉందంటున్నారు లక్ష్మణ్! ఇంతకీ చెప్పాల్సింది ఏంటంటే… ముఖ్యమంత్రి కేసీఆర్, ఒవైసీల పొత్తు గురించట!!
ఈ నెలలో ప్రతీ పల్లెకీ, ప్రతీ ఇంటికీ భాజపా వెళ్తుందన్నారు లక్ష్మణ్. తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఒవైసీ అనీ, ఇద్దరూ కలిసే ప్రతీ అంశానికీ మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వక్రభాష్యం చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారన్నారు. పార్లమెంటులో చట్టం చేసిన తరువాత అసెంబ్లీలో చేసే తీర్మానం చెల్లదని తెలిసి కూడా ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ద్వంద్వ నీతిని వివరిస్తామన్నారు. ఆ రెండు పార్టీలు, ఇద్దరు నేతలూ కలిసి తెలంగాణ ఏరకంగా నాశనం చేస్తున్నారనేది చెప్తామన్నారు. బాధ్యతాయుతమైన సీఎం కుర్చీలో ఉండి అసదుద్దీన్ కి కొమ్ము కాయడం సరికాదన్నారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రజలకు చెప్పి, ప్రజాక్షేత్రంలో ఇద్దర్నీ దోషులుగా నిలబెడతామన్నారు లక్ష్మణ్.
ఇదీ ఇంటింటికీ వెళ్లి భాజపా చేయబోతున్న ప్రచారం..! సీఏఏని తెరాస వ్యతిరేకిస్తోంది. అయితే, ఆ వ్యతిరేకతను తిప్పి కొడతామనే పేరుతో బయల్దేరుతున్న భాజపా చేయబోతున్న ప్రచారం ఏంటంటే… కేసీఆర్, ఒవైసీ ఒకటేనని చెప్పడమట! దీన్నేమంటారు..? తెరాస, మజ్లిస్ పార్టీలు ఒకటేనని ప్రచారం చేయడం ద్వారా భాజపా సాధించాలనుకుంటున్నది ఏముంది..? సీఏఏ గురించి ప్రజలకు అవగాహన కల్పిద్దామనుకుంటే ఆ ఒక్క అంశం గురించే మాట్లాడాలి. కానీ, భాజపా ప్రయత్నం అలా లేదు! కేసీఆర్, ఒవైసీల మైత్రిని బలంగా చూపిస్తూ… ఒక వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించాలనే ప్రయత్నమే ఈ ప్రచార కార్యక్రమం వెనక కనిపిస్తోంది.