బండి సంజయ్ పాదయాత్రలో వెల్లువలా ఇతర పార్టీల నేతలు వచ్చి తమ పార్టీలో చేరిపోతారని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. కానీ ఇప్పటి వరకూచేరిన వారు ఎవరూ లేరు. చేరతారని ప్రచారం జరిగిన వాళ్లంతా వెళ్లి కాంగ్రెస్‌తో చర్చలు జరుపుకుంటున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ పార్టీలో డీకే అరుణ ఉండటంతో మళ్లీ తమ పాత పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్టీలో చేరికపై ఇప్పటికే రేవంత్‌తో చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు.
బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామయాత్ర 5వ తేదీన ఆయన మహబూబ్‌నగర్‌జిల్లా కేంద్రంలో నిర్వహించే సభకు వస్తున్నారు. ఆయన సమక్షంలో భారీగా చేరికలను ఏర్పాటు చేసి సత్తా చాటాలనుకున్నారు. కానీ ఇప్పటికీ ఓ స్థాయి నేతలెవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చివరికి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు చల్లా వెంకట్రామిరెడ్డి కూడా తర్వాత చూద్దామని చెప్పేశారు. వీరంతా ఎందుకిలా వెనుకడుగు వేస్తున్నారో బీజేపీ నాయకులకూ అర్థం కావడం లేదు.
తెలంగాణలో బీజేపీకి మంచి హైప్ వచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే క్యాడర్ పరంగా.., పార్టీ నిర్మాణ పరంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆ పార్టీలో ఉత్తేజం పెరిగింది. కేసీఆర్‌కు ధీటైన నాయకుడు రేవంత్ అన్న ప్రచారం ప్రారంభం కావడంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో బీజేపీలో చేరాలనుకున్న నేతలు ఊగిసలాడుతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతల ప్రయత్నాలు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి.