తెలంగాణ బీజేపీలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. పార్టీ మార్పు కోసం కొంత మంది గోడ దూకేందుకు అనువైన వాతావరణం కోసం చూస్తున్నారు. రహస్య సమావేశాలు ప్రారంభించారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహనరావు, చాడా సురేశ్రెడ్డిలు హైదరాబాద్లో రహస్యంగా భేటీ అయ్యారు.
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో వీరంతా సమావేశమయ్యారు. బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం గత కొంతకాలంగా తమ పట్ల అనుసరిస్తున్న తీరుపై వీరు తమ అభిప్రాయాలు చెప్పుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్కు దగ్గరవుతుందని అది తమ రాజకీయానికి వ్యతిరేకమని తీర్మానించుకున్నారు. అసలు తాము పార్టీలో ఉన్నామో లేదో కూడా గుర్తించడానికి పార్టీ పెద్దలు ఆసక్తి చూపించడం లేదని వీరి ఆందోళన. కాంగ్రెస్కు జోష్ పెరిగిందనే వాతావరణం ఏర్పడటంతో మళ్లీ ఈ సీనియర్లందరూ తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు.
రహస్యంగా సమావేశమైన ఎనిమిది మందిలో ఐదారుగురిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం వారు రహస్యంగా భేటీ కావటం, కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే సంకేతాలతో కమలంలో కలకలం రేగుతోంది. ఇప్పటికే విజయశాంతి సోనియా అంటే గౌరవం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో… వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వివేక్ ఇప్పటికే హైకమాండ్ తో టచ్ లో కి వెళ్లారని… చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.