తెలంగాణలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. బీజేపీ నేతలు పోలీసులపై దూకుడుగా ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక నుంచి ఈ తరహా వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే రాజాసింగ్ దాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. గోవుల అక్రమ రవాణా వెనుక పోలీసులు ఉన్నారని.. అధికార పార్టీ కోసమే పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌కు కోపం వచ్చింది. వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చి బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించారు.
సాధారణంగా రాజకీయ విమర్శలపై పోలీసులు స్పందించరు. కానీ.. నేరుగా కమిషనరే బీజేపీ నేతలకు హెచ్చరికలు ఇవ్వడంతో .. ఇదే సందు అనుకుని బీజేపీ నేతలు మరింతగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రమోషన్ల కోసం కొందరు పోలీసులు.. కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. గోవధపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయడం లేదని.. పోలీసులు చేయలేని పనిని రాజాసింగ్ చేసి చూపిస్తున్నాడని ఆయన తన ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడారు.
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ ను అదే పనిగా టార్గెట్ చేయడంతో తాను గెలిచిన తర్వాత కమిషనర్లకు ఆ విజయాన్ని అంకింతం ఇచ్చినట్లుగా రఘునందన్ రావు సెటైర్ వేశారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ… టీఆర్ఎస్ నేతలు డబ్బు, మద్యం పంచుతూంటే పోలీసులు పట్టించుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. కొన్ని పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేశారు. కమిషనర్లపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు.. అది మరింత ముందుకెళ్తోంది.