ఇళ్లు లేని నిరుపేదలకు… ఇళ్ల అద్దెల కోసం నెలకు రూ. ఐదు వేల రూపాయలు ఇస్తామని… భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇదే ప్రధాన హామీగా… మేనిఫెస్టోను .. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విడుదల చేశారు. విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వారికి రూ. ఐదు వేలు పెన్షన్, అమర వీరుల కుటుంబాలకు రూ. లక్షల సాయం కూడా.. మేనిఫెస్టోలో ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్… ఓ మీడియా సమావేశంలో పేదల ఇళ్ల అద్దెల్ని కడతామని.. ఆ ఎన్నికల హామీని మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. ఈ ఆలోచన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత ఓ హుస్నాబాద్ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న కేసీఆర్ ఈ హామీపై సెటైర్లు వేశారు. కేంద్రం గత ఎన్నికల సమయంలో మనిషికి రూ. 15 లక్షలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పారని.. ముందు ఆ హామీని నెరవేర్చాలన్నారు. అంతటితో ఆగలేదు… ” బీజేపీ నేతలు చెంబట్క పోతే వాసన రాకుండా చేస్తామని” కూడా హామీ ఇస్తారని కూడా … కామెడీ చేశారు. అయినా బీజేపీ నేతలు ఆ హామీకే కట్టుబడి ఉన్నారు.
కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదేమిటని… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఓ సందర్భంలో… మీడియా అడిగితే.. ఎన్నికల సందర్భంలో వంద చెబుతాం… అన్నీ చేయలగమా ఏమిటి.. అంతా జుమ్లా అని… తేలిగ్గా తీసి పడేశారు. అప్పట్నుంచి బీజేపీ హామీలకు విలువ లేకుండా పోయింది. విచిత్రంగా.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహా హామీని… కొద్దిగా మార్చి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. డబుల్ బెడ్ రూం ఇళ్లకు అర్హత సాధించిన నిరుపేదలకు.. వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకూ.. ఏడాదికి రూ. 50 వేల వరకూ అద్దె కడతామని హామీ ఇచ్చింది. దీన్నే తెలంగాణ బీజేపీ లక్ష్మణ్ గుర్తు చేసి.. తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మండిపడ్డారు.
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి కూడా. ..నేడో రేపో పూర్తి స్థాయి ఎన్నికల హామీల్ని ప్రకటించబోతోంది. ఇప్పటికే… నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు, లక్ష రుణమాపీ వంటి పథకాలు ప్రకటించారు. అన్ని పార్టీల మేనిఫెస్టోల్ని చూసి… అత్యంత ఆకర్షణీయమైన వాటిని తన హామీలుగా ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గట్టి పోటీ ఉందని భావిస్తున్న తరుణంలో… పేదలకు గుండుగుత్తగా ఓట్లు వేసేలా.. ఉచిత హామీలతో టీఆర్ఎస్ హోరెత్తించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రాజకీయ పార్టీల ఎన్నికల హామీలు చూస్తేనే ప్రజల కడుపు నిండిపోతుంది. మరి అమలు చేస్తే తట్టుకుంటారో లేదో..!