తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కోపం వచ్చింది. ఇతర పార్టీల మీద… ఇతర పార్టీల నేతల మీద కోపం రావడం సహజమే… కానీ.. ఆయనకు కోపం వచ్చింది మాత్రం సొంత పార్టీ నేతల మీద. అలా ఇలా కాదు.. చర్యలు తీసుకుంటానని ఊగిపోతున్నారు. ఎందుకంటే.. తనకు చెప్పకుండా బీజేపీ నేతలు వెళ్లి కేటీఆర్‌ను కలిశారట. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేటీఆర్‌ను కలవడం ఏమిటనేది ఆయనప్రధాన అభ్యంతరం. అలా కలిసింది గ్రేటర్ బీజేపీ నేతలు. అదీ కూడా బీజేపీకి మేలు చేయమని కోరేందుకే వెళ్లారు. అయితే ఇది బండి సంజయ్‌కు ఏ మాత్రం నచ్చడం లేదు.
గ్రేటర్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచారు. అయితే ఆయన ప్రమాణస్వీకారం చేయక ముందే చనిపోయారు. దాతో ఉపఎన్నిక అనివార్యం అయింది. గెలిచిన బీజేపీ కార్పొరేటర్ కుటుంసభ్యుడ్ని ఏకగ్రీవంగా గెలిపించాలని ఆ నియోజకవర్గం బీజేపీ నేతలంతా అపాయింట్మెంట్ తీసుకుని కేటీఆర్‌ను కలిశారు . కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించి లింగోజీ గూడ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ నేతల పని ఫలవంతమైంది. కానీ బండి సంజయ్‌కు ఇది నచ్చలేదు. అది బీజేపీ సిట్టింగ్ సీటు అని.. భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్న చోట.. ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ వద్దకు వెళ్లడం ఎందుకుని..పైగా తన అనుమతి తీసుకోకకపోవడం ఏమిటని ఆయన ఫైరవుతున్నారు.
లింగోజిగూడ నుంచి టీఆర్ఎస్ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. అయినప్పటికీ అక్కడ ఏకగ్రీవం అయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి అనుచరుడు నామినేషన్ వేస్తున్నారు. మరికొంత మంది కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ పరిస్థితి చూసి.. టీఆర్ఎస్ నేతలు కూడా.. కేటీఆర్‌పై ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది. ఏకగ్రీవం అయ్యే చాన్స్ లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ప్రకటించి… అభ్యర్థిని దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.