తెలంగాణలో ప్రస్తుతం ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతోంది భాజపా. జాతీయ నాయకులు కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి మరీ పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే రాష్ట్ర భాజపా అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను ఆర్ లక్ష్మణ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తననే మరోసారి కొనసాగించాలంటూ ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆయన చెయ్యాల్సిన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు లక్ష్మణ్ హయాంలోనే గెలిచినట్టు కదా! దీంతోపాటు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ఆయనే ఒంటిచేత్తో ప్రచారాన్ని నెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి, ఈ నేపథ్యంలో ఆలోచిస్తే లక్ష్మణ్ ను కొనసాగించే అవకాశాలే ఉన్నట్టు కనిపిస్తాయి. ఈయనతోపాటు, మరో ఇద్దరు నేతలు కూడా రాష్ట్ర భాజపా అధ్యక్ష్య పదవి కోసం పోటీ పడుతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెను ఓడించి, నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది! సీఎం కుమార్తెను ఆయన ఓడించడంతో రాష్ట్రంలో భాజపాకి మోరల్ గా గట్టి ప్లస్ అయిందనేది ఆ పార్టీ నాయకుల విశ్లేషణ. ఇదే ఊపును కొనసాగించడం కోసం ఈ మధ్య సీఎం కేసీఆర్ మీద మాటల దాడులకు దిగుతున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. యువకుడు, ఎప్పట్నుంచో భాజపాని నమ్ముకుని ఉన్న నాయకుడిగా అరవింద్ కి గుర్తింపు ఉంది. దీంతో ఆయనకి రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన డీకే అరుణ కూడా ప్రయత్నాలు చేస్తున్నారట!
లోక్ సభ ఎన్నికల ముందే ఆమె భాజపాలో చేరినా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. పాలమూరు జిల్లా నుంచి కొంతమంది నేతల్ని భాజపాలో చేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. దీంతో భాజపా జాతీయ నాయకత్వం గుడ్ లుక్స్ లో అరుణ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో తెరమీదికి వస్తున్న మరో పేరు ఎవరంటే.. బండి సంజయ్. కరీంనగర్ ఎంపీగా తెరాస సీనియర్ నేత వినోద్ కుమార్ ని ఓడించారు. ఆయన కూడా తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి, తెలంగాణలో రాష్ట్ర అధ్యక్ష పదవి భాజపాలో హాట్ టాపిక్ గా మారబోతుంది. మరో రెండు నెలల్లో అధ్యక్ష నియామకం జరిగిపోతుందని అంటున్నారు.