తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కొత్త సారధిని నియమించవలసిన సమయం ఆసన్నం అయింది. తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తాను మళ్లీ బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగాలేనని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. నిజానికి ఇప్పటికే మూడుసార్లు కట్టబెట్టినందున ఆయన పేరును పార్టీ పట్టించుకునే చాన్సులేదు. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎంపిక అవశ్యం. అయితే కొత్త దళపతిగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు? అనే అంశమే తెలంగాణ రాష్ట్ర సమితితో , భాజపా భవిష్యత్తులో అనుసరించబోయే స్నేహబంధాలకు సంబంధించి సంకేతం అవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
భాజపాలో ఈ పదవి కోసం ప్రధానంగా నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. మురళీధర్‌రావు, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. అయితే వీరిలో ఆరెస్సెస్ బ్యాక్‌గ్రౌండ్ తో పార్టీకోసం పూర్తి చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు కొందరు ఉన్నారు. మరికొందరు కేవలం రాజకీయ నేపథ్యంతో రాజకీయ సమీకరణాల ప్రకారమే పనిచేయగల వారు. ఇలాంటి నేపథ్యంలో.. పదవి ఎవరిని వరిస్తుందన్నది సస్పెన్స్‌గానే ఉంది.
ప్రత్యేకించి సామాజిక వర్గాల సమతూకం పాటించడం కూడా ఇక్కడ కీలకంగానే గమనిస్తున్నారు. చింతలకు పదవి ఇచ్చినట్లయితే.. గత నాలుగు దఫాలుగా ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టినట్లు అవుతుంది. మరికొందరి ఎంపిక కేసీఆర్ సామాజిక వర్గానికే ఇచ్చినట్లు అవుతుంది.
ఇలాంటి సంక్లిష్టమైన సమయంలో.. తెరాసతో భవిష్యత్తులో మైత్రీ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం భాజపా లక్ష్యం అయితే గనుక.. ఎమ్మెల్సీ రామచంద్రరావుకు పదవి కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనకు తెరాసతోనూ స్నేహబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఆయనైతే తెరాసతో స్నేహం కుదురుతుందని.. రెండు పార్టీలు రాష్ట్రంలో కలిసి ముందుకు సాగవచ్చునని పార్టీ ఆలోచించవచ్చునని ఒక ఆలోచన. అలా కాకుండా, ఎప్పటికీ తెరాసకు పోటీగా, తెరాసకు ప్రత్యామ్నాయంగానే భాజపాను ముందుకు తీసుకువెళ్లదలచుకుంటే గనుక.. ఆరెస్సెస్ నేపథ్యంనుంచి వచ్చిన వారికి అధ్యక్షస్థానం దక్కుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన డాక్టర్ లక్ష్మణ్, పేరాల చంద్రశేఖర్‌రావులలో ఒకరికి పదవి దక్కవచ్చు. మొత్తానికి తెలంగాణ సారథి ఎంపిక ఈ రాష్ట్రంలో తెలుగుదేశంతో సంబంధాల విషయంలో కూడా… భాజపా ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా అవుతుందని రాజకీయ వర్గాల్లో అంచనాలు సాగుతున్నాయి.