ఒక ఆంధ్రప్రదేశ్‌కు అధ్యక్షుడి పేరును ప్రకటించడం మాత్రం ఎందుకు ఆగిపోయింది. అయిదు రాష్ట్రాలకు అధ్యక్షులను ఒకేసారి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అంతే వేగంగా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయింది. ఏపీకి కూడా అధ్యక్ష నియామకం జరగాల్సి ఉన్నప్పటికీ.. అదొక్కటి మాత్రం ఆగిపోవడం వెనుక మర్మం ఏమైనా ఉన్నదా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. భాజపా ఎంపిక చేయదలచుకున్న నాయకుల పేర్లను ప్రకటించడంలో చంద్రబాబునాయుడు తన మంత్రాంగం నడిపి చక్రం అడ్డువేశారేమో అని కూడా కొత్త అనుమానాలు చర్చల్లో పుడుతున్నాయి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండింటికీ ఒకేసారి కొత్త అధ్యక్షుల నియామకం ఉంటుందని భాజపాలో చాలాకాలంనుంచి చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో ఈ పదవిని కొత్తగా స్వీకరించడానికి చాలా మందే సిద్ధం అవుతున్నారు. ఎలాంటి పనులు చేస్తూ ఉంటే అధిష్ఠానం ప్రసన్నమై తమను అధ్యక్ష పీఠానికి ఎంపిక చేస్తుందో అలాంటి పనులతో దూకుడుగా చెలరేగుతున్న వారు అనేకులు ఉన్నారు. అయితే శుక్రవారం నాడు మొత్తం అయిదు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించిన భాజపా నాయకత్వం ఏపీని మాత్రం ఆపినట్లు తెలుస్తోంది.
నిజానికి ఇక్కడ సోము వీర్రాజు, పురందేశ్వరి, ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు లలో ఒకరికి పదవిఇవ్వాలనేది పార్టీ ఆలోచనగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కొత్త నాయకత్వం విషయంలో పాత నీరుకు గుడ్‌బై చెప్పి, పార్టీ గళాన్ని గట్టిగా, స్పష్టంగా వినిపించే అవకాశం ఉన్న లక్ష్మణ్‌ను ఎంపిక చేశారు. ఏపీలో సోము వీర్రాజుకు పదవి ఖరారు అని చాలాకాలంగా ప్రచారం ఉంది. ఆయన చంద్రబాబునాయుడు ప్రభుత్వం అంటే లెక్కాపక్కా లేకుండా విరుచుకుపడుతున్నారు. శుక్రవారం ప్రకటనకు ముందు కూడా.. సోము వీర్రాజు ఫైనలైజ్ అవుతున్న దశలో చంద్రచక్రం అడ్డు పడిందా అనే ప్రచారం ఇప్పుడు వినిపిస్తోంది.
సోము వీర్రాజుకు ఇస్తే.. తెదేపాతో తెగతెంపులకు భాజపా సిద్ధమైపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి స్పష్టంగా వెళతాయని, ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఇరు పార్టీలకు అది శ్రేయస్కరం కాదని చంద్రబాబునాయుడు అడ్డు పడి ఉంటారని అనుకుంటున్నారు. భాజపా విధానాల ప్రకారం.. ఒకరికి రెండుసార్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కంభంపాటి హరిబాబు ఒక టర్మ్ మాత్రమే పూర్తి చేశారు. ఆయనకు ఇంకోసారి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆయనకు ఇవ్వాలనేది చంద్రబాబు సిఫారసుగా ప్రచారం ఉంది. అయితే హరిబాబు.. చంద్రబాబు అనుకూల నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా వద్దు అని.. పార్టీలో తెదేపాతో శత్రువైఖరితోనే నాయకత్వం నెరపగల సోమువీర్రాజు, పురందేశ్వరిలలో ఒకరికి ఇవ్వాలని ఒక వాదన ఉంది. ఈ రెండు వాదనల్లో ఏది నెగ్గుతుందో తొందరలోనే తేలుతుందని పార్టీ నేతలు అంటున్నారు.