తెలంగాణ బీజేపీ సూపర్ స్పీడ్‌గా ఉంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని బలంగా నమ్ముతున్న ఆ పార్టీ ముందుగనే అభ్యర్థుల్ని ప్రకటించాలని భావిస్తోంది. కనీసం యాభై సీట్లను అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నేతలకు కొన్ని సూచనలు చేసింది. అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసి పెట్టుకోవాలని సూచించింది. ఆ ప్రకారం రాష్ట్ర నాయకత్వం పోటీ లేని.. యాభై సీట్లలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేర్లను సిద్ధం చేశారు. ఒక్కరే అభ్యర్థుల స్థానాలతోపాటు ముఖ్య నేతలు, వివిధ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు, కచ్చితంగా గెలిచే అవకాశాలున్న సీట్లలో అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నట్లు టీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లోనూ కొందరికి పార్టీ తరఫున ఎన్నికల అభ్యర్థిగా పని మొదలుపెట్టాలని కూడా నాయకత్వం సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. కొంత మంది సీనియర్లకు ఈ సారి పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంబేద్కర్ జయంతి రోజున బండి సంజయ్ చేపట్టే రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నెలలోనే జనగామ లేదా మరో ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఆ తర్వాత నుంచి వరుసగా బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ తెలంగాణలో జెండా పాతాలన్న లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది.