తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెల్లడౌతాయి. హంగ్ తప్పదేమో అనే ఊహాగానాలే వినిపిస్తున్న నేపథ్యంలో… కొత్త సమీకరణాలు మొదలైపోయాయి. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీలోనే తీవ్ర తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్.ఐ.ఎమ్. లేకుంటే తెరాసకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్టుగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మొన్ననే ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ నాయకత్వంలో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే, ఈ సమీకరణాలకు పూర్తి భిన్నమైన ప్రకటన చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హంగ్ వస్తే తమ పాత్ర ఏంటనే స్పష్టత తమకు ఉందనీ, ఎవ్వరికీ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఏ పార్టీ కోరినా తాము మద్దతు ఇవ్వమన్నారు. తమకు దక్కిన స్థానాలతో ప్రజల తరఫున పోరాటం చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ప్రకటనతో రాష్ట్ర భాజపాలో తీవ్ర చర్చకు తెర లేచిందని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. లక్ష్మణ్ వ్యాఖ్యలకు మద్దతుగా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోపక్క, తెరాస స్పందన ఎలా ఉందంటే… తమకు ఎవరి మద్దతూ అవసరం లేదు, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థానాలు దక్కుతాయంటూ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. భాజపా అవసరం తమకు లేదన్నట్టుగా ఆ పార్టీ వైఖరి ఉంది.
అయితే, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు దృష్ట్యా చూసుకుంటే ఏర్పడబోయే ప్రభుత్వంలో క్రియాశీల పాత్రను తీసుకోవాలన్నది భాజపా వ్యూహం. దక్కిన కొద్ది సీట్లతో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా కూర్చుంటే… ఏరకంగానూ ఉపయోగం ఉండదు. కాబట్టి, తెరాసకు సొంతంగా మెజారిటీ ఉన్నా కూడా.. ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ఉన్న అవకాశాలను భాజపా ఓపెన్ గానే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా తెరాసకు దగ్గరయ్యే అవకాశాలు లేకుండా భాజపా ఎందుకు చేసుకుంటుంది..? జాతీయ స్థాయి రాజకీయాల దృష్టితో ఆలోచిస్తే… మోడీ హవా రివర్స్ లో ఉంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో భాజపాకి అనుకూలంగా ఏకపక్ష తీర్పు అనేది ఉండదనే అంచనాలే బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులు అవసరం. బలమైన ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకునే పరిస్థితిలో భాజపా లేదు. పైగా, ఆంధ్రాలో టీడీపీని దూరం చేసుకున్నారు. అక్కడ కోల్పోతున్న ఎంపీ స్థానాల మద్దతును వేరేచోట భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి, ఎవరితోనూ కలిసేది లేదంటూ మడికట్టుకుని కూర్చుంటే నష్టం భాజపాకే.