తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొత్తం ఐదు క్లస్టర్లుగా విభజించుకుని యాత్రలు ప్రారంభించారు. కలిసి కదులుదాం, మరోసారి మోదీని గెలిపిద్దాం అంటూ విజయసంకల్ప యాత్రను ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్రేజ్, రామ మందిరరం ద్వారా రాజకీయ మైలేజీని దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ యాత్రలో ఐదు దశాబ్దాల అయోధ్య రామమందిరం కలను సాకారం చేసిన మోదీ సందేశంతో పాటు గత పదేళ్లలో కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలువడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పెట్టుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లను గెల్చుకుంది. గతంలో తెలంగాణలో బీజేపీకి ఒక శాసనసభ్యుడే ఉన్నాడని.. అప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 7.1 ఉందన్నారు. అయితే, ఇప్పుడు అది రెట్టింపై 14 శాతానికి పెరిగి 8 మంది బీజేపీ శాసనసభ్యులు గెలుపొందారని బీజేపీ నేతలు స్ఫూర్తి తెచ్చుకుంటున్నారు.
తెలంగాణలో నాలుగు పుణ్యక్షేత్రాల నుంచి మంగళవారం ప్రారంభమైన విజయ సంకల్ప యాత్రలు కోలాహలంగా సాగుతున్నాయి. కాషాయ వస్త్రాలు ధరించి, కమలం జెండాలను చేతబట్టుకొని వేలాది మంది కార్యకర్తలు ఈ యాత్రల్లో పాల్గొంటున్నారు. రామభక్తులను అయోధ్యకు తీసుకెళ్లడంతోపాటు రామ మందిరం, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో కూడిన కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. మోదీకి ఎనలేని క్రేజ్ ఉందని… బీజేపీ నేతలు అనుకుంటున్నారు. వారి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.