తెలంగాణలో మరోసారి యాత్రకు సిద్ధమౌతున్నారు భాజపా నేత లక్ష్మణ్. ఈ యాత్ర లక్ష్యం ఏంటంటే… కేసీఆర్ పాలనలో అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తారట. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందనీ, దీనిపై ప్రజలకు వివరించడంతోపాటు, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని లక్ష్మణ్ చెప్పారు. తాము సంధించబోతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వంపై ప్రజలు యుద్ధం ప్రకటించాలనీ, ఆ తరహాలో ప్రజలను సన్నద్ధం చేసేందుకు తాము యాత్ర మొదలుపెట్టబోతున్నామని ఆయన చెప్పారు.
తెలంగాణలో ప్రజలు భాజపావైపు మాత్రమే ఉంటారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామనీ, కేంద్రం ఇచ్చిన కేటాయింపులపై అంకెల చిట్టా విప్పబోతున్నామని అన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయనీ, అందుకే అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే విధంగా చైతన్య యాత్ర ఉంటుందని చెప్పారు. తెరాసకు ప్రత్యామ్నాయం తాము మాత్రమేననీ, కాంగ్రెస్ ఎన్నటికీ కాదని విమర్శించారు. కాంగ్రెస్ తెరాసల మధ్య లోపయికారీ ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. నిజాం తరహాలోనే కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారన్నారు. తెరాస మజ్లిస్ కు అనుకూలంగా పని చేస్తోందనీ, ఆ పార్టీ జెండా మోస్తోందనీ ఆరోపించారు.
కొన్నాళ్ల కిందట కూడా ఇలానే యాత్ర అంటూ ప్రజల్లోకి వెళ్లొచ్చారు లక్ష్మణ్. దానికి సోసోగా స్పందన వచ్చింది. ఇప్పుడు మళ్లీ యాత్ర అంటున్నారు. కేంద్ర కేటాయింపులపైనే ప్రశ్నిస్తామనీ అంటున్నారు. ఆ ప్రశ్నలేవో ఇప్పుడే వెయ్యొచ్చు కదా! నిజానికి, యాత్రకంటే ముందుగా పార్టీ దృష్టి పెట్టాల్సిన అంశం… పార్టీలోకి జనాదరణ ఉన్న కొద్దిమంది నేతల్ని ఆహ్వానించడం. ఎందుకంటే, కేవలం మోడీ ఇమేజ్ ఒక్కటే పార్టీని బలోపేతం చేసే పరిస్థితి లేదు. మోడీ హవా ప్రజల్ని ఆకర్షించే అంశం ఇక్కడ కానే కాదు. వాస్తవం మాట్లాడుకుంటే.. దేశవ్యాప్తంగా మోడీ హవాకి ఊపు తగ్గుతున్న పరిస్థితులే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయంలో భాజపా మిస్ అవుతున్న మరో ముఖ్యమైన అంశం… రాష్ట్రంలోని ఒక పార్టీ వారి అజెండా ఏంటనేది! ఏపీలోగానీ, తెలంగాణలోగానీ భాజపా విజన్ ఏంటి..? రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర నేతలు ఏం చేయబోతున్నారు, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటనే అంశాలపై దృష్టే పెట్టడం లేనే లేదు! తెలుగు రాష్ట్రాలకి కేంద్రం చాలా చేసిందీ… వాటి గురించి ప్రజలకు వివరిస్తే చాలు.. అద్భుతమైన ఆదరణ వచ్చేస్తుందన్న నమ్మకంతో యాత్రలూ ప్రచార కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటున్నారు. ఇవి టైంపాస్ కార్యక్రమాల్లానే ఉంటున్నాయి తప్ప… పార్టీ బలోపేతానికి పునాదులు ఎలా అవుతాయి..?