తెలంగాణ భాజపాకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందనే ప్రచారం కొన్నాళ్లుగా ఉన్నదే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక ఈ ప్రక్రియ పూర్తవుతుందని అప్పట్లో చెప్పారు. కొత్తవారి ఎంపిక ఉంటుందీ అనగానే ఆశావహుల పేర్లూ తెరమీదికి వచ్చాయి. మరోసారి తనని కొనసాగించాలనే విన్నపంతో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ తోపాటు ఎంపీ బండి సంజయ్, డీకే అరుణలాంటి పేర్లు ప్రముఖంగానే వినిపించాయి. అయితే, ప్రస్తుతం తెలంగాణ భాజపా అధ్యక్ష పదవి ఎంపికకు సంబంధించి జాతీయ నాయకత్వం ఒక కొత్త ఆలోచన చేస్తున్నట్టు రాష్ట్ర నేతల్లో చర్చ మొదలైంది.
ప్రస్తుతం తెరాసకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. కాంగ్రెస్ కి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇదే తరహా ఇప్పుడు భాజపాకు కూడా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కొత్తగా సృష్టించే ఆలోచనలో ఢిల్లీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. నిజానికి, భాజపా జాతీయ నాయకత్వం కూడా ఇదే తరహాలో నాయకుడిని మార్చింది! హోం మంత్రిగా అమిత్ షా నియమితులయ్యాక పార్టీ బాధ్యతల్ని నెమ్మదిగా బదలాయించడం కోసం జేపీ నడ్డాని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఆ తరువాత, ఈ మధ్యనే పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ను కొనసాగిస్తూ… ఆయనకి సాయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక నేతను ఎంపిక చేసే ఆలోచనపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
ఇప్పటికిప్పుడు లక్ష్మణ్ స్థానంలో మరొకరిని అధ్యక్షునిగా ఎంపిక చేసినా… ఇతరుల్లో అసంతృప్తులకు ఆస్కారం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడీ ప్రక్రియ పెట్టుకుంటే నాయకుల మధ్య ఐకమత్యం దెబ్బతినే అవకాశమూ లేకపోలేదు. వచ్చిన కొత్తవారికి మిగతావారి నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలూ కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ని నియమించి, ఎన్నికల ముందువరకూ లక్ష్మణ్ ని కొనసాగించి, ఈలోపు వర్కింగ్ ప్రెసిడెంట్ ని కీలకం చేసి, ఆ తరువాత పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని సమాచారం. ప్రతిపాదన బాగానే ఉన్నా… వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అనే చర్చా ఉండనే ఉంది. దానికి ఉండాల్సిన పోటీ అదే స్థాయిలోనే ఉంటుంది. లక్ష్మణ్ ను మరో రెండేళ్లపాటు కొనసాగిస్తారనే ప్రకటనతోపాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంశం కూడా ఈనెలలోనే పార్టీ అధికారికంగా వెల్లడిస్తుందని భాజపా వర్గాల్లో వినిపిస్తోంది.