సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాజకీయ ప్రకంపనలతో హీటెక్కింది. ఓ వైపు తెలంగాణ విమోచనం అని బీజేపీ నేతలు భారీ సభ పెట్టగా… కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరాను నిర్వహించింది. దేశంలోనే అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో రెండో వారు అమిత్ షా. ఆయన వచ్చిన కారణంగా తగినంత ప్రచారం.. గౌరవం ఇవ్వడానికి మీడియా పోటీ పడ్డాయి. ఆయన కార్యక్రమానికి భారీగా ప్రచారం కల్పించాయి. అయితే అంత వరకే. బీజేపీ సభకు కానీ.. ఆ సభ ఎలా జరిగింది..ఎంత మంది వచ్చారన్నదానిపై పెద్దగా ప్రచారం రాలేదు. సోషల్ మీడియాలో అసలు పట్టించుకున్నవారు లేరు.
మంత్రి అమిత్ షా కూడా కేసీఆర్‌ను పెద్దగా విమర్శించలేదు. ఆయన ఎంఐఎంను గురి పెట్టారు. ఆయన స్పీచ్ విని ఇతర పార్టీల నేతలకు కూడాఆశ్చర్యం వేసింది. హైదరాబాద్‌కు పరిమితం అయిన ఎంఐఎంను ఆయన ఎందుకు తెలంగాణలో ప్రాధాన ప్రత్యర్థిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారో బీజేపీ నేతలకు అర్థం కాలేదు తెలంగాణ విలీనమా.. విమోచనమా.. విద్రోహమా అన్నదానిపై ఇప్పుడు ప్రజల్లో పెద్దగాఎవరికీ పరిజ్ఞానం లేదు. ఆసక్తి అంత కంటే లేదు. అయినా ఇప్పుడేదో రజాకార్ల గురించి చెప్పి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూస్తే అమిత్ షా పర్యటన తో కేసీఆర్‌పై తాము దండయాత్ర చేస్తామన్న అభిప్రాయాన్ని కల్పించడంలో విఫలమయ్యారు.
గజ్వేల్‌లో కాంగ్రెస్ సభకు మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా కవరేజీ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను పకబ్బందీగా వాడుకుంది. గజ్వేల్ సభకు జనం భారీగా తరలి వచ్చేలా రేవంత్ ముందు నుంచీ ప్రణాళికలు సిద్ధం చేశారు. బూత్‌కు తొమ్మిది మంది అని టార్గెట్ పెట్టడంతో దానికి తగ్గట్లుగా తరలి వచ్చారు. గజ్వేల్ జనసందోహం అయింది. రేవంత్ రెడ్డి టీం ఈ సభను సోషల్ మీడియాలో ట్రెండింగ్ తేవడంతో తన వంతు ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై పోరాటం విషయంలో తన విజన్‌ను వెల్లడించి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
మొత్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీకేసీఆర్ పై పోరాడుతున్నామన్న అభిప్రాయం కల్పించడంలో .. రేవంత్ రెడ్డితో పోలిస్తే వెనుకబడింది. కేసీఆర్.. రాష్ట్ర నాయకులు చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు అమిత్ షా చేయలేదు. అదే సమయంలో మీడియాలో తప్ప ప్రజల్లో స్పందన లేదు. కానీ ప్రజల్లో కదలికను రేవంత్ రెడ్డి చూపించగలిగారన్న అభిప్రాయం వినిపిస్తోంది.