తెలంగాణ బీజేపీ ఒకటి, రెండు చోట్ల లోక్ సభ అభ్యర్థులను మార్చనుందనే టాక్ గట్టిగా నడుస్తోంది. క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల మార్పు అంశాన్ని పరిశీలిస్తుందని ప్రచారం జరుగుతోంది. పక్క పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు తప్పుబడుతున్నారు. అభ్యర్థులను మార్చాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అర్థం చేసుకొని అభ్యర్థులకు సహకరించాలని కిషన్ రెడ్డి సర్దిచెప్పినా సానుకూలత కనిపించకపోవడంతో అభ్యర్థుల మార్పుపై ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా నల్గొండ, హైదరాబాద్ అభ్యర్థులను మార్చుతారని బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా శాసనంపూడి సైదిరెడ్డి బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయించారని క్యాడర్ ఆగ్రహంగా ఉంది. దాంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సైదిరెడ్డితో కలిసి పని చేసేది లేదని క్యాడర్ తేల్చి చెప్తోంది. పైగా.. ఆయన పాత నేతలను కలుపుకు వెళ్లడం లేదని.. ఒంటెత్తు పోకడలు పోతున్నారని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో నల్గొండ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డిని పేరును బీజేపీ పరిశీలిస్తోందని.. ఆయనను పార్టీలో చేర్చుకొని టికెట్ కన్ఫామ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించిన మాధవీలతపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒవైసీని ఓడించాలంటే బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేయాలని కానీ ఆమె క్యాడర్ ను పట్టించుకోకుండా సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం మీడియాలో హైప్ రావడంతో పెద్ద నేతగా భ్రమ పడుతున్నారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. క్యాడర్ అసంతృప్తిని గుర్తించిన రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను మార్చుతుందనే నమ్మకం తమకు ఉందంటూ బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
బీజేపీలో ఒక్కసారి టికెట్ ఫైనల్ చేశాక అభ్యర్థులను మార్చడం చాలా అరుదు. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండకపోవచ్చు. కానీ, అభ్యర్థుల మార్పుపై విస్తృత ప్రచారం జరుగుతోంది.