తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఎక్కడిదక్కడ ఆగిపోయిన పథకాన్ని మార్చిలోపు అన్ని నియోజకవర్గాల్లో కనీసం వంద మందికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎక్కడా పెద్దగా ముందడుగు పడుతున్న దాఖలాల్లేవు. కానీ బడ్జెట్లో మాత్రం ఈ సారి భారీ కేటాయిపులు చేయాలని నిర్ణయించుకున్నారు. కనీసం రూ. ఇరవై వేల కోట్లపైనే కేటాయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఓ పథకానికి కేటాయించాలటే మొత్తం బడ్జెట్ అంచనాలు గందరగోళంగా మారతాయి.
ఇక దేనికి తగ్గింపులు చేయాలన్నది పెద్ద సమస్య అవుతుంది. దేనికీ కేటాయింపులు తగ్గించకుండా దళిత బంధుకు కేటాయింపులు జరగాలి. ఈ అంశంపై తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు కసరత్తు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికలకు కేసీఆర్ దళిత బంధునే తురుపుముక్కగా భావిస్తున్నారు. ఈ ఏడాది కేటాయించినట్లుగా ఇరవై వేల కోట్లు దళితుల కోసం ఖర్చు పెట్టగలిగితే ప్రధానమైన ఓటు బ్యాంక్ తనకు మళ్లుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే గుజరాత్‌తో పాటే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలోనూ కేసీఆర్ ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకునేందుకు కూడాకేసీఆర్ రెడీగా ఉన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలంటే మాటలు కాదు. ఉత్తరాది దళిత కుటుంబాల్లోకి ఈ పథకం వెళ్తే కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. రైతుబంధుతో ఇప్పటికే ఆయన రైతు వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నారన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా కేసీఆర్ దళిత బంధు పథకానికి భారీగా నిధులు కేటాయించి అసలైన పొలిటికల్ గేమ్ ఆడబోతున్నారన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.