తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ 2016-17ఆర్ధిక సం.ల రాష్ట్ర బడ్జెట్ ను ఈరోజు ఉదయం 11.35 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. నిన్న సాయంత్రమే బడ్జెట్ ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఈసారి బడ్జెట్ సుమారు రూ.1.27 లక్షల కోట్లు ఉంటుందని సమాచారం. ప్రణాళికా వ్యయం క్రింద రూ.67,660 కోట్లు, ప్రణాళికేతర వ్యయంగా రూ.60,000 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. లోయర్ పెన్ గంగ, లెండి తదితర ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే ప్రకటించారు కనుక ఈసారి ప్రవేశపెట్టబోయే (జీరో బేస్డ్) బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులకి చాలా బారీ కేటాయింపులు ఉండవచ్చును. బడ్జెట్ లో సుమారు రూ. 25,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించబోతున్నట్లు సమాచారం. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీరు, త్రాగునీరు, సంక్షేమ పధకాలను పూర్తి చేయడానికి అవసరమయిన నిధుల సమీకరణ కోసం రుణాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.