తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ 2019-20 ఏడాదికి రూ. 1,46,492 కోట్లకు పరిమితమయింది. తెలంగాణపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ గణాంకాలతో సహా వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.1,82,017 కోట్ల పద్దును ప్రతిపాదించారు. పూర్తి స్థాయిలో పద్దులో అది రూ. 1,46,492 కోట్లకు పరిమితయింది. అంటే… రూ. 35వేల 500 కోట్ల మేర తగ్గిపోయింది. ఈ మేరకు.. వివిధ శాఖ కేటాయింపుల్లో తగ్గుదల కనిపించింది. ఎంత తగ్గుదల ఉన్నప్పటికీ.. ఇంత భారీ స్థాయిలో తగ్గుదల ఉండదని… రాజకీయవర్గాలు భావించాయి. అయితే.. రూ. లక్షన్నర కోట్లకన్నా.. తక్కువకే పద్దు పరిమితం చేయడం ఆర్థిక వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది.
ఓటాన్ అకౌంట్ పద్దులో రెవెన్యూ వ్యయం రూ.లక్షా 31,629 కోట్లుగా చూపించారు… పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మొత్తం రూ. 1,11,055 కోట్లు మాత్రమే. ఆర్థికలోటును ఫిబ్రవరిలో రూ.27,749 కోట్లుగా అంచనా వేయగా.. ఇప్పుడు అది రూ.24,081 కోట్లకు తగ్గింది. తెలంగాణలో అత్యంత కీలకమైన ఆసరా పెన్షన్లకు ఓటాన్ అకౌంట్లో రూ.12,067 కోట్లు కేటాయించారు. ఈ సారి మాత్రం.. ఆ మొత్తం రూ.9,402 కోట్లకు పరిమితమయింది. లబ్దిదారుల వయసు తగ్గించి.. పెన్షన్ మొత్తాన్ని పెంచినందున.. ఈ మొత్తం సరిపోవడం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాల అంచనా. రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు కొనసాగించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా… రైతు బంధు పథకం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఓటాన్ అకౌంట్లోనూ ఇంతే కేటాయించారు. గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు, మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు, విద్యుత్ సబ్సిడీలకు రూ.8 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.1125 కోట్లు కేటాయించారు. వీటిలో పెద్దగా హెచ్చు తగ్గులు లేవు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని.. తెలంగాణ సీఎం కేసీఆర్… చెప్పకనే చెప్పారు. ఇక నుంచి ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు ఉండబోవని… బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం ప్రకటించారు. పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం ఇక ఖర్చు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు ఉంటాయన్నారు.