ఆర్థిక మంత్రిగా తొలిసారి తెలంగాణ వార్షిక బడ్జెట్ ని హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఇది సమతౌల్య బడ్జెట్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అన్నింటి మధ్యా సమతౌల్యత సాధిస్తూ ప్రవేశపెట్టిన వాస్తవిక బడ్జెట్ ఇది అన్నారు కేసీఆర్. ఆర్థిక మాంధ్య పరిస్థితులు నెలకొన్నా, కేంద్రం నిధుల్లో కోతలు పెడుతున్నా రాష్ట్ర అభివృద్ధి ఆగకుండా చక్కని బడ్జెట్ రూపొందించారని మంత్రి హరీష్ ని మెచ్చుకున్నారు. అయితే, బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ పన్నుల ఆదాయం తగ్గిపోయిందనీ, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం రావడం లేదనీ, సమీప భవిష్యత్తులో ఇంకా తగ్గొచ్చనే విధంగానే హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్నట్టుగా… వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్టా ఇది అనిపించే విధంగా అంకెలున్నాయి! రూ. 1.82,914 కోట్ల బడ్జెట్ ఇది. రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ. 22,061.18 కోట్లు. రెవెన్యూ మిగులు రూ. 4.48 వేల కోట్లు. ఆర్థిక లోటును రూ. 33,191.25 కోట్లుగా బడ్జెట్లో చెప్పారు. సంక్షేమ పథకాలు, ఇతర రంగాలకు ఎంతెంత కేటాయిస్తాం, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నామని యథావిధిగా మంత్రి హరీష్ చెప్పారు.
ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి ఆగదని మంత్రి చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను వీలైనంతగా ఇంకా పెంచుకుంటామని కూడా చెప్పారు. ప్రభుత్వ ప్రణాళికలు సుదీర్ఘమైనవీ, నాలుగేళ్ల విజన్ తో అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఆదాయం తగ్గిపోయిందనీ, కేంద్రం ఇవ్వలేదనీ, వనరులు లేవని చెబుతూనే… ఒక జంబో బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి! అత్యంత వాస్తివిక, సమతౌల్య బడ్జెట్ అని కేసీఆర్ కితాబిచ్చారుగానీ… నిర్దేశించిన లక్ష్యాలను ఏవిధంగా చేరుకుంటారనే వివరణ మంత్రి ఇవ్వలేదు. ఏ వనరుల్ని ఎలా ఉపయోగించుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తుందో చెప్పలేదు. లోటు భర్తీ ఎలాగో వివరించలేదు.