తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు బోయినపల్లి వినోద్ కుమార్. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో.. నాలుగైదు లక్షల ఓట్ల తేడాతో.. కరీంనగర్ నుంచి గెలుస్తారని అందరూ అనుకున్న ఆయన అనూహ్యంగా.. బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. దాంతో.. వినోద్‌ను ఎమ్మెల్సీ చేసి.. మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆశావహులు ఎక్కువగా ఉండటం.. సామాజిక సమీకరణాలు కలసి వచ్చే అవకాశం లే్కపోవడంతో… వినోద్‌కు మరో మార్గం ద్వారా… మంత్రి స్థాయి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు.
వినోద్‌కు పదవి ఆషామాషీగా.. ఏదో పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో .. ఇవ్వలేదు. ఆయన సేవలు పూర్తి స్థాయిలో.. ఇంకా చెప్పాలంటే.. ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉపయోగించుకునేందుకే… ఈ పదవి ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక శాఖ బాధ్యతలు కేసీఆర్ వద్దే ఉన్నాయి. కీలకమైన శాఖలన్నీ కేసీఆర్ వద్దే ఉండటం.. ఆయన తీరిక లేకుండా ఉండటంతో.. బడ్జెట్ కసరత్తు పెద్దగా ముందుకు సాగడం లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ను వచ్చే నెలలో ప్రవేశ పెట్టాలనుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల్లో గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టారు.
వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి కసరత్తును వినోద్‌కుమార్ కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి ఇతర పదవుల కన్నా… ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవే కరెక్టని కేసీఆర్ భావించినట్లుగా తెలుస్తోంది. అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారు చేసే కీలక బాధ్యతను ఇచ్చారు. ఇక.. వినోద్ కుమార్.. అనధికార ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తారని… అర్థం చేసుకోవచ్చు.