తెలంగాణలో ఆర్థిక మంత్రి లేకుండా బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతోంది. ఫిబ్రవరి మూడో వారంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని .. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదముద్ర వేయనున్నారు. ఆలోగా మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అప్పు రేపు అన్నట్లుగా.. మంత్రివర్గ విస్తరణ వచ్చే వారం అనే… సమాధానం.. ప్రతి వారం వస్తోంది. దీంతో ఇప్పటికే అధికారులు.. బడ్జెట్ కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వమే ఉన్నా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకే మొగ్గు చూపుతున్నారు కేసీఆర్. లోక్ సభ ఎన్నికల కారణంగా.. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టదు. ఓటాన్ అకౌంట్ మాత్రం పెడుతుంది.
తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దీంతో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులలో స్పష్టత ఉండదని తెలంగాణా ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని కోసం ఫిబ్రవరి 18 నుండి మూడు లేదా ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. లోక్ సభ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగుతున్నాయి..అవి ముగిసిన తర్వాత ఫిబ్రవరి 18 నుండి తెలంగాణా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉభయ సభలున్న రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఆర్థిక శాఖా మంత్రి,శాసన మండలిలో మంత్రి వర్గంలోని ఎవరో ఒక సీనియర్ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారు. సిఎం కేసీఆర్ కాకుండా హోం మంత్రి మహమూద్ అలీ ఒక్కరే ఉన్నారు. దీంతో హోం శాఖ మినహా మిగిలిన ఆర్థికశాఖతో సహా అన్ని శాఖలూ సీఎం వద్దే ఉన్నాయి. సీఎం ఆధ్వర్యంలోనే బడ్జెట్ కసరత్తు జరుగుతోంది.
బడ్జెట్ సమావేశాల వరకు మంత్రి వర్గ విస్తరణ చేయకపోతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆరే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రే బడ్జెట్ ప్రవేశ పెట్టడం కూడా ఒక రికార్డే. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెడితే మండలిలో మహమూద్ అలీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ మంత్రి లేకుండా బడ్టెట్ సమావేశాలు జరగడం..ఒక ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టడం రికార్డుగా నిలిచే అవకాశం ఉంది. ఆర్థికశాఖ మంత్రే బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే నిబంధనే లేదు. కాబట్టి.. బడ్జెట్ కోసం మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆతృత కూడా కేసీఆర్‌కు లేదు.