హైకోర్టు అదే పనిగా ఆదేశాలిచ్చి.. ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలంగాణ సర్కార్… కరోనాపై సమగ్ర సమాచారాన్ని ఇచ్చేందుకు బులెటిన్ స్వరూపాన్ని మార్చింది. ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో.. ఎక్కడెక్కడ బెడ్స్ ఖాళీగా ఉన్నాయో వివరాలు ప్రకటిస్తే.. అవసరమైన వారు.. ఆయా ఆస్పత్రులకు నేరుగా వెళ్తారని.. అలాంటి సమాచారం ఇవ్వాలని.. హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.., ఇంత కాలం… హైకోర్టు ఆదేశాలను పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు మార్పు వచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు.. మార్చిన కరోనా బులెటిన్‌లో ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలను పొందు పరిచారు.
ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఐసోలేషన్ బెడ్స్ పన్నెండు వేల వరకూ ఉంటే… వెయ్యి మాత్రమే పేషంట్లు చికిత్స పొందుతున్నారు. మిగతా వన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆక్సీజన్ సౌకర్యం ఉన్న బెడ్స్‌లో 20 మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. 2900కిపైగా ఖాళీగా ఉన్నాయి. ఐసీయూ బెడ్స్‌లో 235 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. అవి కూడా వేలల్లోనే ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం చూస్తే.. అసలు తెలంగాణలో కరోనా ప్రభావం లేదని అనుకోవాలి. చికిత్స కోసం అసలు కంగారు పడాల్సిన అవసరమే ఉండదు. కానీ.. బయట ఎందుకు పానిక్ కనిపిస్తోందనేదే కీలకం.
పాజిటివ్ వచ్చిన వారిని.. ఇప్పుడు ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు. లక్షణాలు లేకపోయినా… మైల్డ్‌గా లక్షణాలు ఉన్న హోం క్వారంటైన్కే సిఫార్సు చేస్తున్నారు. ఇంట్లో సౌకర్యాలు లేవని.. పిల్లలు.., పెద్దవాళ్లు ఉన్నారని.. తాము ఆస్పత్రికే వస్తామని .. పాజిటివ్ రోగులు బతిమాలినా… అవకాశం ఇవ్వడం లేదు. బెడ్లు లేవంటున్నారు. దాదాపుగా 90 శాతానికిపైగా బెడ్లు ఖాళీగా ఉన్నప్పుడు.. ఎందుకు ట్రీట్మెంట్ కోసం.. పాజిటివ్ రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదన్నది సందేహంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతోనే.. రోగులు పెద్ద ఎత్తున… ప్రైవేటు ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. అక్కడా… బాగా డబ్బులున్న వారినే చేర్చుకుంటున్నారు. ఫలితంగా ప్రజల్లో ఓ రకమైన ఆందోళన కనిపిస్తోంది.