తెలంగాణలో ఆర్గీసీ బస్సు చార్జీలు పెరిగాయి. ఒకప్పటి ఎర్రబస్సు, ఇప్పటి పల్లెవెలుగు మొదలుకుని ఏసీ బస్సుల వరకూ యథాశక్తి బాదుడు మొదలు కాబోతుంది. ఈ నెల 27 నుంచి కొత్త చార్జీలు మోతమోగుతాయి. రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సచివాలయంలో ఈ విషయం ప్రకటించారు.
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో గత ఏడాదే బస్సు చార్జీలను పెంచారని మంత్రి గుర్తు చేశారు. అయినా ఏడాదిపాటు చార్జీలను పెంచకుండా తెలంగాణ ప్రభుత్వం గొప్ప త్యాగం చేసిందన్నట్టు మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పెంచుతున్నామని చెప్పారు. ప్రజలపై వేసిన ఈ భారం వల్ల సంస్థకు ఏటా 286 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా.
చార్జలను పెంపును ప్రకటిస్తూ మంత్రి చేసిన వింత వాదన విస్మయం కలిగిస్తోంది. తెలంగాణ సంపన్న రాష్ట్రం. గుజరాత్ తర్వాత మనదే ఆర్థికంగా గొప్ప రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ గుర్తు చేస్తుంటారు. అందుకే, గత ఏడాది ఆర్టీసీ కార్మికులు కోరినదానింటే ఎక్కువ వేతనాల పెంపును కేసీఆర్ అట్టహాసంగా ప్రకటించారు. ఇంకా అనేక హామీలు కురిపించారు. ఇప్పుడు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలతో పోల్చి, ఏడాది ఆలస్యంగా చార్జీలు పెంచుతున్నాం అనడం ఆశ్చర్యకరం. అంటే, అప్పుడే ఈ ప్రభుత్వం సంపన్న రాష్ట్రాన్ని ఏపీ, కర్ణాటక స్థాయికి తీసుకుపోయిందని భావించాలా? మరింకేమని అనుకోవాలో మంత్రి గారు సెలవిస్తే బాగుండేది.
ఉన్న ఆర్థిక వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ప్రజలపై భారం వేయాల్సిన అవసరం రానే రాదు. కొత్త రాష్ట్రం వచ్చింది, బాధలు, భారం ఉండవని ప్రజలు సంబరపడ్డారు. రెండేళ్లలోనే ఆ ఆనందం ఆవిరయ్యే నిర్ణయాలను తీసుకోవాడం అవసరమా? ఏడాదికి 286 కోట్ల రూపాయల కోసం సంపన్న రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రయాణికులందరినీ ఇబ్బంది పెట్టడం భావ్యమా? అని కేసీఆర్ ఆలోచించారో లేదో. ఇప్పటికే హైదరాబాదులో అద్భుతమైన సచివాలయం ఉంది. అయినా కొత్త దాని కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అలాంటి నిర్ణయాలతో నిధులు దుబారా చేయడం ఎందుకు, ప్రజలపై భారం వేయడం ఎందుకు? అడిగే వాళ్లు లేరనా? ప్రతిపక్షాలను నామ్ కే వాస్తే చేశామనే ధైర్యమా? అన్నీ గమనిస్తున్న ప్రజలు, అవసరం అనుకున్నప్పుడు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఈ విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించిందో లేదో.