ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టబోతున్నారని.. ఆ ప్లాంట్ ను తమ తమ రాష్ట్రాల్లో పెట్టించుకునేందుకు కొంత మంది పోటీ పడుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు టెస్లాకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణ మాత్రం కూల్‌గా.. టెస్లా కాకపోతే దాని కంటే పెద్ద కంపెనీని తెచ్చుకుందామని ప్రయత్నించింది. అనుకున్నట్లుగా విజయం సాధించింది. టెస్లాను దాటేసిన చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తెలంగాణలో ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది.
తెలంగాణలో ప్లాంట్ కు మూడు ప్రాంతాల్లో బీవైడీ పరిశీలన
తెలంగాణలో ని హైదరాబాద్ శివార్లలో బీవైడీ కంపెనీ మూడు ప్రాంతాలను పరిశీలిస్తోంది. తెలంగాణ ఈవీ పాలసీ ప్రోత్సాహకరంగా ఉండటం మౌలిక సదుపాయాలు బాగా ఉండటంతో హైదరాబాద్ శివార్లలో మెగా ఫ్యాక్టరీని బీవైడీ నిర్మించనుంది. ఎక్కడ పెట్టాలన్న దానిపై కంపెనీ తుది నిర్ణయం తీసుకుంటే.. ఒప్పందాలు చేసుకోనున్నారు.
అమ్మకాల్లో టెస్లాను దాటేసిన బీవైడీ
చైనాకు చెందిన బీవైడీ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి , అమ్మకాలలో టెస్లాను దాటిపోయింది. 2023లో బీవైడీ 3 మిలియన్ల కంటే ఎక్కువ “న్యూ ఎనర్జీ వెహికల్స్” ఉత్పత్తి చేసింది, టెస్లా 1.84 మిలియన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. 2024 చివరి త్రైమాసికంలో కూడా బీవైడీ టెస్లాను అధిగమించి సుమారు 1.78 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది, టెస్లా 1.77 మిలియన్ వాహనాలతో వెనుకబడింది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కన్నా బీవైడీ వాహనాలే బెటరన్న ఇమేజ్ పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న బీవైడీ
బీవైడీ చైనా మార్కెట్లో నెంబర్ వన్ గా ఉంది. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా మార్కెట్లకు విస్తరిస్తోంది. టెస్లా ఉత్తర అమెరికా, యూరప్ లలోనే ఎక్కువ మార్కెట్ సాధించింది. విపరీతంగా ధరలు ఉండటం టెస్లాకు మైనస్. టెస్లా కార్ల కంటే మెరుగ్గా ఉంటాయని రివ్యూలు ఉన్న బీవైడీ కార్ల ధరలు టెస్లాతో పోలిస్తే చాలా తక్కువ. దీని వల్ల బీవైడీ వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు.
అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో అమెరికా మార్కెట్ టెస్లాకు పెద్ద ప్లస్. అక్కడి షేర్ మార్కెట్ టెస్లా వాల్యూ చాలా ఎక్కువగా ఉండటంతో టెస్లా మార్కెట్ క్యాప్ 500 బిలియన్ల వరకూ ఉంది. కానీ ఇది బీవైడీ విషయంలో వంద బిలియన్లే ఉంటుంది.