తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సందిగ్ధం నెలకొంది. మొదట లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాళీగా ఉన్న ఆరు బెర్త్ లను భర్తీ చేస్తారని ప్రకటించినా ఇప్పుడు ఆ ఇష్యూ చర్చ రాకపోవడంతో కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మొదట లోక్ సభ ఎన్నికల తర్వాత మంత్రి పదవుల భర్తీ ఉంటుందని పార్టీ పెద్దల ప్రకటనతో ఆశావహులు మాత్రం ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి తాము చేసిన సేవలను ప్రత్యేకంగా పేర్కొంటూ ప్రభుత్వ పెద్దల ముందు ఉంచుతున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా తమకు మంత్రి పదవి ఇవ్వాలని చాలామంది నేతలు ప్రపోజల్ పెట్టుకుంటున్నారు.అయితే, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం తమ ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో సహా 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. వాటిని జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారిగా భర్తీ చేయనున్నారు. ప్రస్తుత కేబినెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో త్వరలో భర్తీ చేయబోయే మంత్రి పదవుల నియామకంలో ఈ జిల్లాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే, రేవంత్ కేబినెట్ లో ఇప్పటికే సీఎంతో కలిసి ఏడుగురు ఓసీలు ఉండటంతో సీనియర్ నేతలైన రెడ్లకు అవకాశం ఉంటుందా..? అనే చర్చ జరుగుతోంది.
శనివారం తెలంగాణ కేబినెట్ సమావేశం ఉండటంతో ఇందులో కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నది క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.