అదిగో కేబినెట్ విస్తరణ.. ఇదిగో కేబినెట్ విస్తరణ.. అంటూ అధిష్టానం సంకేతాలు ఇస్తున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అని ఓసారి, రేవంత్ విదేశీ పర్యటన ముగిసిన వెంటనే అని మరోసారి.. ఇలా హైకమాండ్ లీకులు ఇస్తూ వాయిదా వేస్తూ పోతోంది. తను కోరిన నేతలకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని రేవంత్ పట్టుబడుతుంటే.. సీనియర్లు ఇతరుల పేర్లను సిఫార్స్ చేస్తుండటంతో మంత్రివర్గ విస్తరణ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ప్రస్తుత కేబినెట్ లో అతి కొద్ది మంది మాత్రం రేవంత్ కు తోడుగా నిలబడుతున్నారు. సీఎంపై ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే ఒకరిద్దరు మినహా మంత్రులు ఎవరూ పెద్దగా ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు ముందుకు రావడం లేదు. రైతు రుణమాఫీ , హైడ్రా.. ఇలా విషయం ఏదైనా బీఆర్ఎస్ , బీజేపీ నేతలు నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అయినా మంత్రివర్గం నుంచి ఆశించిన స్థాయిలో రేవంత్ కు మద్దతు లభించడం లేదని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
దీంతో కేబినెట్ విస్తరణలో తనకు అనుకూలురుగా ఉండే నేతలకు చోటు కల్పించాలని అధిష్టానాన్ని రేవంత్ పట్టుబడుతున్నారు. అదే సమయంలో సీనియర్లు అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఇటీవల జమ్మూ – కశ్మీర్ ఎన్నికలపై అధిష్టానం దృష్టి పెట్టడంతో కేబినెట్ విస్తరణపై ఫోకస్ చేయలేకపోయింది. ఇక, ఎన్నికలు ముగుస్తుండటంతో ఈ విషయంలో నాన్చివేతకు ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చేసింది.
దీంతో మంత్రివర్గ విస్తరణలో రేవంత్ అనుకూల నేతలకు అధిష్టానం చోటు కల్పిస్తుందా? లేదంటే సీనియర్లు చెప్పిన నేతలకు అవకాశం ఇస్తుందా? మధ్యేమార్గంగా రేవంత్, సీనియర్లు సూచించిన నేతలకు ప్రాధాన్యత ఇస్తుందా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.