మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయమని… వారం, పది రోజుల కిందటే.. ప్రగతి భవన్ నుంచి జీఏడీ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దాని ప్రకారం.. వారు అన్నీ రెడీ చేసుకున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో.. టీఆర్ఎస్ లో మంత్రి పదవుల ఆశ పెట్టుకున్న వారిలో చాలా మంది ఎమ్మెల్యే… తమ ప్రమాణ స్వీకార పాఠాన్ని రోజుకు పది సార్లు చదువుకు బట్టీ పట్టేశారు. అధికారికంగా చెప్పకపోయినా పద్దెనిమిదో తేదీన విస్తరణ ఖాయమన్న అంచనాలకు… అందరూ వచ్చారు. కానీ అసలు తేదీ దగ్గరకు వచ్చేటప్పటకి… కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఆలస్యం అనివార్యమన్న సూచనలు వస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగానే మంత్రి వర్గ విస్తరణ చేపడతారని అనుకుంటున్నారు కానీ.. కేసీఆర్ మాత్రం… ఈ విషయంలో వేరే ఆలోచనల్లో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంది. కొత్తగా మంత్రులు ప్రమాణస్వీకరం చేసినా.. వారికి పనేమీ ఉండదు. ఎందుకంటే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి … కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టి… తెలంగాణకు ఏమేమీ ఇస్తారో క్లారిటీ వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. అప్పటి వరకూ.. ప్రమాణం చేసినా.. మంత్రులు ఖాళీగా ఉండటమేనని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో శాఖలను కలిపేసే ప్రక్రియ కూడా నడుస్తోదంంటున్నారు. ఇది కూడా మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణమంటున్నారు. సీనియర్లను నిరాశ పర్చడం ఎందుకని.. పరిమితంగా ఎనిమిది మందిని మంత్రులుగా ప్రమాణం చేయించాలనే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త తరహాలో సాగుతున్నాయి. ఒకే ఒక్క మంత్రి… ఉన్న కేబినెట్ నడుస్తోంది. కేబినెట్ సమావేశాలు కూడా అలాగే నడుస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి.. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించినప్పుడు.. అసెంబ్లీ సమావేశాల్ని వీలైనంత త్వరగా.. ఏర్పాటు చేస్తూంటారు. కానీ.. తెలంగాణలో మాత్రం ఆ “వీలు” 37 రోజులకు కానీ రాలేదు. మంత్రివర్గ విస్తరణకు మాత్రం క్లారిటీ రాలేదు.