ఉగాది రోజు జరుగుతుందనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆశావహులంతా నిరాశకు గురయ్యారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి రొటీన్ గా కలిశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కానీ మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ఇచ్చారని అంటున్నారు. పేర్ల గురించి చెప్పకపోయినా వచ్చే వారంలో విస్తరణ ఉంటుందని ఏర్పాట్ల అంశంపై చర్చించిట్లుగా చెబుతున్నారు.
నాలుగో తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చని ప్రాథమికంగా కొంత మంది కాంగ్రెస్ మఖ్యులు సన్నిహితులకు సమాచారం ఇస్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది. పలువురు నేతలు ప్రాంత, సామాజిక సమీకరణాలను చూపించి తమకు చాన్స్ ఇవ్వాలని ఇప్పటికీ హైకమాండ్ ను సంప్రదిస్తున్నారు.
రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై ఎవరితోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. హైకమాండ్ నుంచి సమాచారం వస్తుందని తనను కలిసిన ఎమ్మెల్యేలతో చెబుతున్నారు. ఎవరెవర్ని ఖరారు చేస్తారో తనకూ తెలియని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. నాలుగో తేదీన విస్తరణ ఉండటం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు.