టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఫుల్ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం, పార్టీని పరుగులు పెట్టించేందుకు నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. అయితే ఇక పూర్తి స్థాయిలో పరుగు పెట్టే ముందు కేసీఆర్ తన టీమ్‌ను సంస్కరించుకోవాల్సి ఉంది. ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. కేబినెట్లో ఒక స్థానం ఖాళీ అయ్యింది. మరికొందరిని మార్చాలని అనుకుంటున్నారు. ఎవరెవరికి చోటు దక్కబోతోందన్నదానిపై ఇప్పుడు టీఆర్ఎస్లో చర్చలు ప్రారంభమయ్యాయి.
ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీలకూ చాన్స్ దక్కనుంది. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీకి వచ్చిన బండ ప్రకాష్‌కు ఖాయమంటున్నారు. అలాగే కరీంనగర్ నుంచి గెలిచిన ఎల్.రమణ, కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి వారు మంత్రి పదవుల ఆశల్లో ఉన్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన వారిలో.. ఎమ్మెల్సీలుగా అవకాశం పొందిన వారిలో ఎక్కువగా మంత్రులుగా పనిచేసిన, సుధీర్ఘరాజకీయ అనుభవం ఉన్నవారున్నారు. అందుకే మంత్రి పదవుల ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు జాగ్రత్తగా సమీకరణాలు చూసుకోవాల్సి ఉంది.
ఎమ్మెల్సీలను మంత్రులుగా చేస్తే ఎమ్మెల్యేలు ఫీలవుతారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారిని ఎమ్మెల్సీలు చేసి..మంత్రులు చేస్తే ఉద్యమకారులు ఫీలవుతారు. ఇలాంటి అనేక సమీకరణాలను చూసుకుని కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల టీమ్ కాబట్టి పర్ ఫెక్ట్‌గా ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నారు. సంక్రాంతి తర్వాతే ఈ అంశంపై మళ్లీ టీఆర్ఎస్లో కదలిక వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు.