పార్లమెంట్లో వైసీపీకి ఇటీవల ఓ గది కేటాయించారు. అక్కడి ఏర్పాట్లను ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిశీలించారు. ఎక్కడెక్కడ కుర్చీలు ఉండాలి.. ఎలాంటి కేబిన్లు ఏర్పాటు చేయాలి.. ఎవరెవరికి కేబిన్లు ఏర్పాటు చేయాలి వంటి విషయాలపై అధికారులకు సూచనలు చేశారు. అంతే కాదు..ఆమె మకాం ఏపీ భవన్లోనే. అదీ కూడా ప్రభుత్వ అధికారిణి హోదాలో.. కేటగిరి-1 హోదాలో తీసుకున్నారు. కారు కూడా ఏపీ భవన్దే వాడుకుంటున్నారు. ఆమె పెట్టే ప్రతి రూపాయి ఖర్చూ ఏపీ భవన్ ఖాతాలోనే పడుతోంది. అంటే.. మొత్తంగా ఆమె.. ఏపీ ప్రభుత్వం.. ఇంకా చెప్పాలంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తున్నారు. కానీ ఖర్చు మాత్రం ఏపీ ప్రభుత్వంపై పడుతోంది. ఇంతా చేసి.. ఆమె ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారా.. అంటే కానే కాదు.. ఆమె.. ఇప్పటికి తెలంగాణ కేడర్ లో ఉన్నారు. తెలంగాణ జీతం తీసుకుంటున్నారు. కానీ… ఏపీ భవన్లో ఏపీ అధికారి గా రూం పొంది… రెండు, మూడు నెలలుగా ఉంటూ.. వైసీపీ పనులు చేస్తున్నారు.
ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత శ్రీలక్ష్మిని ఏపీకి డిప్యూటేషన్ పై తెచ్చుకోవాలని ప్రయత్నించారు. కేసీఆర్ అంగీకరించడంతో… కేంద్రానికి డిప్యూటేషన్ లెటర్ పెట్టుకున్నారు. కానీ.. కేంద్రం అంగీకరించలేదు. సీబీఐ కేసులు ఉన్నందున అంతర్రాష్ట్ర బదిలీలు కుదరవని స్పష్టం చేసింది. అయితే.. తెలంగాణలో పని చేయడానికి ఇష్టపడని… శ్రీలక్ష్మి సెలవు పెట్టేసి.. ఢిల్లీలో మకాం వేశారు. అక్కడ ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించడంతో ఆయన చెప్పిన పనులు చేస్తున్నారు. ఓ రకంగా ఆయన పనులన్నీ శ్రీలక్ష్మి చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉంటే… రోజూ ఆయనకు రిపోర్ట్ చేస్తున్నారు. శ్రీలక్ష్మి ఇలా చేస్తూండటంతో.. ఐఏఎస్ వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని… తన ఐఏఎస్ కెరీర్లో చెరుపుకోలేని రిమార్కులు వేయించుకున్న శ్రీలక్ష్మి.. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు కాబట్టి… తనకు ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ వల్ల తన కెరీర్ నాశనం అయిందని.. ఇప్పుడు జగనే తన కెరీర్ను మళ్లీ ఉన్నత స్థాయిలో ఉండేలా చూడాలని పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. ఆమె చాలా చిన్న వయసులో ఐఏఎస్ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా .. ఎక్కువ కాలం ఉండే అవకాశం ఆమెకు ఉండేది. అయికే కేసుల్లో ఇరుక్కోవడంతో మొత్తం తేడా వచ్చేసింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తనకు ఆ స్థాయి కల్పించాలనేది శ్రీలక్ష్మి పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తోంది.