తెలంగాణకు ప్రతీ వారం ఓ భారీ పెట్టుబడి వస్తోంది. గత వారం ఏపీకి చెందిన అమరరాజా గ్రూప్ రూ. తొమ్మిదిన్నర వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించి ఒప్పందం చేసుకోగా.. ఈ వారం.. కాపిటలాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి సుమారు 6,200 కోట్ల రూపాయలతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. రూ. 1,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తుంది. 250,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ ITPH డేటా సెంటర్ను 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాలలో మరో ఐదు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ లో రోజురోజుకు డెవలప్ అవుతున్న IT పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్ తో తీరుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. క్యాపిటలాండ్ నవీ ముంబై కి చెందిన గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ డెవలప్మెంట్ సైట్ను కొనుగోలుతో 2021 లో ఇండియన్ డేటా సెంటర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్ రెండవది.
హైదరాబాద్ కేంద్రం డేటా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా అతి పెద్ద డేటా కేంద్రాన్ని.. పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించి ఒప్పందం చేసుకుంది. అమెజాన్ కూడా అదే పనిలో ఉంది. అదానీ గ్రూప్ కూడా డేటా సెంటర్ పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఓ వైపు తయారీ రంగం.. మరో వైపు సేవల రంగంలోనూ తెలంగాణ పెట్టుబడులను విస్తృతంగా ఆకర్షిస్తోంది.