ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందేనని కేంద్రం తెలంగాణ సర్కార్‌ను ఆదేశించడంతో .. తమకే ఏపీ డబ్బులివ్వాలంటూ తెలంగాణ సర్కార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. : ఏపీ ట్రాన్స్‌కో తమకు బకాయిలు చెల్లించడం లేదని తెలంగాణ ట్రాన్స్‌కో హైకోర్టును ఆశ్రయించింది. అసలు, వడ్డీతో కలిపి రూ.1730 కోట్లు ఏపీ ట్రాన్స్‌కో చెల్లించాలన్న రిట్‌పై హైకోర్టు.. కేంద్ర, ఏపీ సర్కార్, ఏపీ ట్రాన్స్‌కో, ఇతరులకు నోటీసులు ఇచ్చింది. ఇదే తరహాలో గతంలో తెలంగాణ ట్రాన్స్‌కో వేసిన రిట్‌తో కలిపి దీనిని కూడా విచారణ చేస్తామని స్పష్టం చేసింది. ఈ లోగా ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
ఏపీకి నెల రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. ఆ ఆదేశాలు అందినప్పుడే తెలంగాణ మండిపడింది. ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చారని.. మత వాదన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించంది. ఈ క్రమంలో మళ్లీ కేంద్రం వద్దకు వెళ్లడం కంటే… హైకోర్టుకు వెళితే బెటరని.. హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ ఈ కేసు హైకోర్టులో ఉంది. ఇప్పుడు మరోసారి కేంద్రం ఉత్తర్వుల ఆధారంగా పిటిషన్ వేశారు. ఈ కారణంగా రెండు వివాదం మరింత పీట ముడి పడనుంది.
కోర్టులో కేసు తేలే వరకూ తెలంగాణ డబ్బులు చెల్లించదు. తెలంగాణ ఇవ్వకపోయినా జగన్ సర్కార్ అడిగే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయంగా రెండు ప్రభుత్వాలు సన్నిహితంగానే ఉంటున్నాయి. ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన ఏ విషయాన్నీ నేరుగా తెలంగాణ ప్రభుత్వంతో జగన్ సర్కార్ సంప్రదించలేదు. పరోక్షంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలోనూ అంతే. అంటే బకాయిలు వసూలు చేయకపోగా.. కోర్టు కేసుల్లో ఇరుక్కునేలా చేశారని అనుకోవచ్చు.