30 రోజుల యాక్షన్ ప్లాన్ ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాబోయే నెల రోజుల్లో పల్లెల రూపు రేఖలు మారిపోవాలనీ, ఆ దిశగా అధికారులు కృషి చేయాలనీ, అవసరమైతే ప్రజలు శ్రమదానం చేయాలంటూ ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలు, నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలనీ, పంచాయతీలను ఆదర్శవంతంగా ఈ నెల రోజుల్లో తీర్చిదిద్దాలనీ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఉండాలనీ, పరిశుభ్రమైన పల్లెల్లో రాబోయే దసరా పండుగ జరుపుకోవాలని కేసీఆర్ అన్నారు. 30 రోజుల యాక్షన్ ప్లాన్లో అన్ని విభాగాల అధికారులు, అన్ని స్థాయిల నాయకులు విజయవంతం చేయాలని సీఎం చెప్పారు.
రాబోయే ముప్పై రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలేంటో తెలుసా..? పచ్చదనం పెంచడంలో భాగంగా మొక్కల్ని నాటడం, వార్షిక పంచవర్ష ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవడం, నిధుల సద్వినియోగంపై దృష్టి సారించడం, తప్పనిసరిగా పన్నులు వసూళ్లు చేయడం… ఇవీ గ్రామ పంచాయతీలు చెయ్యాల్సిన పనులు. మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థాయిల్లో కూడా ఇవే లక్ష్యాలుంటాయి. ఈ 30 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఓ కొత్త ఒరవడి ప్రారంభం కావాలనీ, ఇది నిరంతర ప్రక్రియగా జరిగేందుకు కలెక్టర్లు చొరవ చూపించాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఒక నెలలో సమూల మార్పు తేవాలనే లక్ష్యం బాగానే ఉంది. అధికారులూ నాయకుల్ని పరుగులెత్తించండం ఖాయం! అయితే, ఇంతకీ ఈ 30 రోజుల యాక్షన్ ప్లాన్ ఇప్పుడెందుకు..? ఈ నెలలో సాధించాల్సిన లక్ష్యాలు చూసుకుంటే… అన్నీ సాధారణ పరిపాలనలో భాగంగా ఉన్నవే. కొత్తవీ, లేదా యుద్ధ ప్రాతిపదిక సాధించాల్సినవంటూ ఏవీ లేవు. ప్రణాళికలు రూపొందించుకోవడం, పన్నులు వసూళ్లు, పరిశుభ్రత, మొక్కలు నాటడం… ఇవన్నీ ఎప్పుడూ జరిగేవే కదా? వీటికి ఎందుకింత హడావుడి అనిపిస్తోంది. ఇన్నాళ్లూ సాధారణ పరిపాలన అనేది తెలంగాణలో కుంటుపడిందనే విమర్శలున్నాయి. ఎన్నికలనీ, కొత్త చట్టాలనీ… ఇలా రకరకాల కారణాలతో గ్రామస్థాయిలో పాలన, ప్రభుత్వ సేవలు వెనకబడ్డాయన్నది వాస్తవం. ఇప్పుడీ 30 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఉరకలు వేయించడం ద్వారా అంతా గాడిలో పెట్టాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యంగా కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే… పాలనపై అలసత్వం వహిస్తూ వచ్చిందీ వారే, ఇప్పుడీ 30 రోజుల్లో త్వరత్వరగా సాధించి తీరాలంటూ లక్ష్యాలు పెట్టి నాయకులూ అధికారులూ ప్రజలూ శ్రమదానం చేయాలంటూ హడావుడి చేస్తున్నదీ వారే.